పుట:MaharshulaCharitraluVol6.djvu/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్వేతకేతుమహర్షి

111


క్రోధాదులు లేక ప్రశాంతస్థిరచిత్తుఁడనై తిని. నీకు నేనే భర్తను. నీవే నాభార్యవు. అది నా కిదివఱకే విదిత మగుట నింతదూరము వచ్చితిని. నచ్చితివా ? ” యని యూరకుండెను.

సువర్చల సిగ్గుపడి వెనుకకుఁ దగ్గెను. దేవలుఁ డానందించి “సువర్చలా! నచ్చెనా? తథా స్తనవచ్చునా!" యని పలుకరించెను. సువర్చల మఱింత సిగ్గుపడి లోనికేఁగి సిగ్గుపెందెరలఁ జీల్చుకొని నచ్చినవరుఁ డని తండ్రిని హెచ్చరించెను. దేవలమహర్షి వెంటనే సగౌరవముగా ఉద్దాలకుని, బంధువర్గమును , ఋషివర్గమును, శిష్యవర్గమును బిలిపించి ముహూర్తనిశ్చయ మొనరించి సర్వసంభారములను సమకూర్చి శాస్త్రోక్తముగ సర్వమునిజన సమక్షమున సువర్చలను శ్వేతకేతున కిచ్చి వివాహమహోత్సవము నిర్వర్తించెను. ఆ దివ్యమంగళ సమయమున “హృత్పుండరీక నివాసుఁడు, సర్వభూతాత్మకుఁడు, సర్వ శోభా సముపేతుఁడు నగుశ్రీహరియే యీ శ్వేతకేతురూపమున నిల్పి యున్నాఁడా? ఆ చల్లనితల్లి మహాలక్ష్మి భూలోకవాసుల లోచనములకుఁ బర్వము గావింప నిటు సువర్చలారూపమున విచ్చేసియున్నదా? లేనిచో ఈ దంపతుల ఆ రూపమునకు దివ్యమంగళవిగ్రహత్వ మెట్టులు వచ్చు?" నని యెల్లరు ననుకొనఁ జొచ్చిరి.

అంత దేవలుఁడు "శ్రీధవుఁ డగుమాధవుని ప్రీతికొఱ కీకన్యాదానముఁ జేసితిని. ఆతఁడు సంతోషించుఁగాక ! నాపుత్రియు నీపత్ని యునగు సువర్చల పతివ్రతయై పుట్టినయింటికీ మెట్టినయింటికి ఖ్యాతి గొనితెచ్చుఁగాక ! ” యని యామెను శ్వేతకేతునకుఁ దలిదండ్రులకు నొప్పగించెను.

ఆశ్రమనిర్వర్తనము

శ్వేతకేతుఁడు విధ్యుక్తవివాహకార్యకలాప మంతయు ముగిసిన పిమ్మట భార్యను దీసికొని తల్లిదండ్రులయు, అత్తమామలయు దీవెన లంది వేఱుచోట నాశ్రమమును నిర్మించుకొని యందు గృహస్థధర్మము నవలంబించెను.