Jump to content

పుట:MaharshulaCharitraluVol6.djvu/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

మహర్షుల చరిత్రలు


తొలుత నాతఁడు పత్నితో “కాంతా! వేదోక్తవిధులాచరించి మనము దేవపితృముని ఋణములను దీర్పవలయును. నేను నీవు నను భావములతో నున్నాము కనుక మన కీ కర్మకలాపము తప్పదు. నీవు నాతోను నేను నీతోను వీని నాచరించి పిదప జ్ఞానాగ్నియందు వానిని భస్మ మొనరింతము. ఉత్తము లేది చేయుదురో సామాన్యు లది చేయుదురు. అందుచేతనే జ్ఞానులును గర్మమానరు. జ్ఞానముచేతనే వారు మానినను అజ్ఞానులు కర్మమానుటలో మాత్రము వాని ననుసరింతురు. దానివలన లోకము కర్మభ్రష్టమై సర్వభ్రష్ట మగును. కావున, మనము లోకశ్రేయమునకు ఆత్మశ్రేయమునకును సద్గృహస్థకర్మము లాచరింత "మని పలికెను. ఆమె సర్వవిధముల నాతని యడుగుజాడలనుబట్టి నడచుచు నుత్తమ సాధ్వియై యుండెను. రత్నముప్రక్క రత్నముచేరిననే శోభించునుగాని మసిబొగ్గు చేరిన శోభింపదుగదా !

జ్ఞానబోధ

ఈ విధముగా సువర్చలాశ్వేతకేతు లనుపమాన ధర్మము లాచరించుచు నుత్తమపుత్త సంపదఁ బడసి పితరులను, అనేకయజ్ఞము లొనరించి దేవతలను, తపస్స్వాధ్యాయసత్ప్రవర్తనలచే ఋషులను సంతోష పఱిచి యా పుణ్యదంపతు లాత్మజ్ఞానమున ద్వంద్వాతీతులై భువిపై దివి చూచుచుఁ జూపుచు, అన్నిటికి సాక్షిభూతులై మాత్రము తా ముండి, మానవలోకమున నున్నను మాధవలోకమున నున్నట్లు వర్తించి యపూర్వ దంపతులై యలరారిరి.

ఒకనాఁడు సువర్చల భర్త నిట్లడిగెను. "బ్రహ్మజ్ఞా ! నీ వన నెవరు? పాంచభౌతికమై కంటికిఁ కనఁబడు నీ శరీరమా నీవు? కానిచో నీ వను దానితత్త్వమును నిపుణముగఁ దెలుపుము." ఆమెకు శ్వేతకేతుఁ డిట్లనెను. "కాంతా ! నీవు నన్ను బ్రహ్మజ్ఞా యని పిలిచితివి. అందులోనే నీవు నన్నెఱిఁగినట్లు స్పష్టము. ఇఁక వేఱే యడుగనేల?” "నీ దేహాంతర్గత మగుఆత్మ నడుగుచున్నాను” అని సువర్చల యనెను “అగుచో, ఆత్మ మాటాడదు, తినదు, కనదు, వినదు, పుట్టదు, చావదు.