పుట:Maharshula-Charitralu.firstpart.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కశ్యప మహర్షి

79


ణార్థమై వాలఖిల్యాది మహర్షులఁ బ్రార్థించి భువనప్రవృత్తికి విపరీతము కాకుండునట్లు తన కుదయించుసుతుఁడు పక్షికులమున కింద్రుఁ డగు నటుటు వారందఱ నొడంబఱిచెను. పిమ్మటఁ గశ్యపుఁడు కద్రూవినతలకుఁ గోర్కిసిద్ధింపఁ జేసి గర్భముల సంరక్షించుకొనుఁ డని చెప్పి పంపివేసెను. కొంత కాలమునకు వారిగర్భములందండము లుదయించెను. వాని నెల్ల ఘృతకుండములఁ బెట్టి యిరువురు రక్షించుచుండిరి. నూఱేండ్లకుఁ గద్రూగర్భాండములు క్రమముగాఁ జిట్లి యందు శేషుఁడు, వాసుకి, తక్షకుఁడు, కర్కోటకుఁడు, ధనంజయుఁడు, కాళియుఁడు మున్నగు వేయిమంది నాగముఖ్యు లుదయించిరి. వినత తన గర్బాండములనుండి పుత్త్రులు కలుగ లేదని విచారించి యొకయండమును బ్రద్దలుకొట్టిన నందుండి యనూరుఁడు జన్మించి యకాలమున నండము జిట్లించుటచేఁ దా నంగహీనుఁడ నై తినని తల్లిని నిందించి రెండవ యండమునైనను జాగ్రత్తగాఁ గాపాడుకొనుమని తల్లికిఁ జెప్పి తాను సూర్యసారథి యయ్యెను. తరువాతఁ జిర కాలమునకు రెండవ యండమునుండి గరుత్మంతుఁ డుదయించెను.

కశ్యపుఁడు గరుత్మంతు నాశీర్వదించుట

గరుత్మంతుఁ డుదయించి మాతృ దాస్యవిమోచనమునకై యమృతముఁ దెచ్చుటకుఁ దల్లి యనుమతి కోరి యామె చెప్పిన చొప్పున సముద్రమునందలి నిషాదుల భక్షించిన నాఁకలి తీఱక తండ్రియగు కశ్యపమహర్షికడ కేఁగి యాహారమడిగెను. కశ్యపుఁడు కుమారుని ధైర్యమునకు మెచ్చుకొని విభావసుఁడు సుప్రతీకుఁ డను బ్రాహ్మణులు కలహించి కూర్మ గజ రూపులై పోరుచున్నారనియు వారిని భక్షింపుమనియుఁ జెప్పెను. గరుత్మంతుఁడు తండ్రి పంపున నలంబతీర్థమున కరిగి రౌహణ మను వృక్షముపై వ్రాల దానిశాఖ విఱిగి పోయెను. దాని నంటి తవముచేయు వాలఖిల్యులకు బాధ కలుగకుండ నాకోమ్మను గ్రిందబడకుండ నోటఁ గఱచుకొని