పుట:Maharshula-Charitralu.firstpart.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కపిలమహర్షి

69


చల్లనివి, తియ్యనివి. స్వచ్ఛమైనవి యగు నీళ్ళు త్రాగి యట నొక లేడి యా ప్రాంతమునఁ బరుగిడుట చూచి యారాజు దాన పై నొక బాణమును విడిచెను. ఆ బాణము తగిలి యా లేడి కపిలముని యాశ్రమము కడకు వచ్చి పడి మరణించెను. అది చూచి కపిలుఁడు తన యాశ్రమమున నిట్టిహింస కావించిన మూర్ఖుఁ డెవఁ డని లేచి యటఁ దిరిగి యొక చెట్టునీడను విల్లమ్ములతోనున్న రాజును జూచెను.

కపిలునిగాంచి పుండరీకుండు గడగడ వణఁకుచు లేచివచ్చి భక్తితో నమస్కరించి కులగోత్రములు చెప్పుకొని తన తప్పిదమును మన్నింపుమని కోరెను. అంత నా మహర్షి యాతనితో నిట్లనెను. "ఓయీ! క్షణభంగుర మగు జీవితము గల మానవుఁడు పశువుకన్న బుద్ధిబలమున మిన్న యయ్యు , ఏపాపమెఱుఁగని, నోరులేని. సాధుజంతువులఁ జంపుటవలన మహాపాపము గడించును. నీ విట్లు దారుణకర్మ మొనరించుటకుఁ గారణమేమి ! రక్తమాంసాది మయ మగు నీ దేహముపై నీకెట్టి మమత కలదో ఆ లేడికి దాని దేహముపై నట్టి మమత యుండదా? తుచ్ఛమగు నీ విలాసమునకై పసికందు, పుణ్యజీవి, యగు నీ లేడి నిండు ప్రాణములను బలిగొంటివే? ని న్నిప్పు డేమిచేసినను దప్పులే" దని యాతని నెంతయు నిందించి వైరాగ్య ముపదేశించెను.

పుండరీకుఁడా మహామహుని మాటలు శూలములవలెఁ గ్రుచ్చుకొనఁగా సిగ్గుపడి పశ్చాత్తాపమంది. తానుజేసిన దోషమున కామహర్షి యెదుటనే ప్రాణత్యాగము చేసికొనఁ దలఁచి వాడియగు కత్తి నొరనుండి తీసి తన శిరముఁ ద్రుంచుకొనఁ బోవుసంతఁ గపిలుఁడు కనికరించి యాతని నాత్మహత్యనుండి కాపాడెను. పుండరీకుఁడు కపిలుని పాదములపైఁ బడి జ్ఞానభిక్షఁ బెట్టుమని ప్రార్థించెను.

అంతఁ గపిలమహర్షి యాతని కిట్లు బోధించెను. “రాజా! మోక్ష మపేక్షించు మానవుఁడు పూర్వదానఫలమునఁ గలిగిన సంప