పుట:Maharshula-Charitralu.firstpart.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహర్షుల చరిత్రలు

ఋష్యశృంగ మహర్షి

తొల్లి కశ్యపుఁడను మునిచంద్రునకు విభాండకుఁడను కుమారుఁ డుదయించెను. విభాండకుఁడు బాల్యము నుండియు నస్ఖలిత బ్రహ్మచర్యదీక్షతోఁ దపము చేయుచుండెను. ఒక్క నాఁ డాతఁ డొక్క మడువున నీళ్ళాడుచున్న సమయమున సురుచిర సురూపసుగుణ సుందరి యగు నూర్వశి యాతనిఁ గానవచ్చి తన విలాసహానములఁ బ్రదర్శించి నంతఁ గామకృతమునఁ బతనమైన యా ముని యమోఘవీర్యముతో మిశ్రమైన జలము నొక మనుఁ బెంటి త్రావి గర్భము ధరించెను.

ఋష్యశృంగుని జననము

ఈ మృగము పూర్వము చిత్రరేఖ యను నొక యప్సరస. ఆమె యింద్రసభలో నాట్యమాడుచుండఁగాఁ గొన్ని లేళ్ళచ్చటికి వచ్చెను. చిత్రరేఖ నేత్రములపై దృష్టినుంచి యానందించుచున్న యింద్రునిఁ జూడక యామె లేళ్ళఁ జూచెను. తనయానందమునకు విశేషభంగము గలిగించిన యా చిత్ర రేఖ నింద్రుఁడు మృగివై పుట్టు మని శపించెను. అప్పు డామె శాపవిమోచనోపాయము కోరుకొనఁగా నింద్రుఁడు కరుణించి విభాండకుఁ డను మహర్షి వీర్యమువలన బుత్త్రునిఁ గనిన పిమ్మట శాపవిమోచన మగునని తెల్పెను. ఆ చిత్రరేఖయే మృగియై దాహము తీర్చుకొనుటకు విభాండకుఁడు స్నానము చేయు జలాశయమునకు వచ్చి జలముతో పాటాతని వీర్యమును గ్రోలి చూలాలయ్యెను.

కొంతకాలమున కా మృగము మనుష్యరూపము గల యొక పుత్త్రునిఁ గని యరణ్యమున విడిచి తనశాపమోక్షణము కాఁగా నింద్ర