పుట:Maharshula-Charitralu.firstpart.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టావక్ర మహర్షి

45


ఏకపాదుఁడు జలమజ్జితుఁడగుట

ఒకనాఁడు సుజాత ప్రసవభారమునకు వెఱచి ఘృతతైల ధాన్యములఁ దెం డని యేకపాదునిఁ గోరెను, ఏకపాదుఁడు నట్లే యని ధనార్థియై జనక చక్రవర్తిపాలికిఁ బోయెను. అప్పుడు జనక చక్రవర్తి వరుణవుత్రుఁ డగు వందితో వాదము చేసి గెలిచినవారికి సమస్తము నిచ్చెద ననియు నోటువడిన వారు జలమజ్జితులై యుండవలె ననియుఁ బ్రకటించెను. ఏకపాదుఁడు విజయకాంక్షియై వందితో వాదమునకు దిగి దైవవశమున నోటువడి జలమజ్జితుఁడై యందుండెను.

అష్టావక్రుఁ డుదయించి తండ్రిని రక్షించుట

ఇట్లుండగా సుజాత యింటియొద్దఁ బుత్రునిఁ గనెను. ఆ పుత్రుఁడు తండ్రి శాపకారణమున నెనిమిది వంకరలతోఁ బుట్టి యష్టావక్రనాముఁ డయ్యెను, ఆ సమయముననే సుజాత తల్లి - ఉద్దాలకుని భార్య - కూడ నొకపుత్త్రునిఁ గనెను. ఆతఁడు శ్వేతకేతుఁ డను నామమునఁ బెరుఁగుచుండెను. మాతుల భాగినేయు లగు నష్టావక్ర శ్వేత కేతు లిరువురును బాల్యము నుండియు నుద్దాలకునికడ నేక సంధాగ్రాహులై చదివి యధ్యయనశూరులైరి. ఉద్దాలకుఁడు తండ్రి యనియు శ్వేతకేతుఁడు భాత్ర యనియు నష్టావక్రుఁ డెంచుచుండెను. ఒకనాఁడు శ్వేత కేతుఁ డష్టావక్రుని “మీ తండ్రికడకుఁ బొ"మ్మని కసరెను. అట్లవమానింపఁబడి తల్లి యగు సుజాతకడ కేఁగి యష్టావక్రుఁడు తన తండ్రి సంగతిఁ జెప్పుమనెను. సుజాత యేకపాదుఁడు జనక నృపాలు నగరమున కేఁగి వందితోడి వాదమున నోడి జలమజ్జితుఁ డగుటఁ దెల్పెను.

అష్టావక్రుఁడు వెంటనే మాతులుఁ డగు శ్వేత కేతునిఁ దీసికొని పోయి జనకమహారాజు నాస్థానమునఁ బ్రవేశింపఁజూడ విదగ్ధులగు వృద్దులే కాని బాలు రట రాఁ గూడ దని ద్వారపాలకుఁడు