పుట:Maharshula-Charitralu.firstpart.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహర్షుల చరిత్రలు

అష్టావక్ర మహర్షి

పూర్వ మొకప్పు డేకపాదుఁ డను సద్బ్రాహ్మణుఁ డొకఁడు నిరంతరతపోనిరతుఁడై యుండెను. అతనికి సుజాత యను నుత్తమకన్య భార్యయై సకలోపచారములు సంతోషముతోఁ జేయుచుండెడిది. సద్గృహస్థుఁడు వేదవేత్త యగు నేకపాదునికడకు వటువరులు వచ్చి యధ్యయన మర్దించిరి. ఏకపాదుఁడు వటువులయధ్యాపనము కూడఁ దపోంగముగా భావించి శిష్యులచే నెల్ల వేళల వల్లింపఁ జేయుచుండెను.

ఏకపాదుఁ డష్టావక్రుని శపించుట

ఇటు లుండఁ గొంతకాలమునకు భర్తయనుగ్రహమున సుజాత గర్భము ధరించెను. ఏకపాదుఁడు నిరంతర శిష్యాధ్యాపనముతో గాలముఁ గడుపుచుండెను. సుజాత గర్భముననున్న బాలునికి గర్భమున నుండఁగనే పుణ్యవశమున వేదము లలవడెను. ఒకనాఁడాతఁడు మాతృగర్భము నుండియే స్వరము తప్పిన దని తండ్రికిఁ జెప్పెను. మఱియొకపర్యాయ మాతఁడు “నిద్రాహారములైన లేకుండ శిష్యుల నెల్లపుడును జదివింతు వేల? మాతృగర్భమున నుండి యొక్క సారి వినఁగానే నాకు వేదములు వచ్చినవి. వారి నింతగా బాధించు చుందువేల?" యని తండ్రి నడిగెను. అంత నేకపాదుఁడు తనకు జన్మించు కుమారుఁడు దివ్యమహిమోపేతుఁ డని గ్రహించి యానందించెను. కాని యింత బాల్యముననే తండ్రికిఁ దప్పు దిద్దుటయు నధ్యయనమును గూర్చి వక్రముగఁ బల్కుటయు శిక్షార్హములే కాని క్షమార్హములు గా వనియు శిక్షింపవలసినపుడు పుత్త్రభావ మడ్డు రారాదనియు నెంచి యాతని నెనిమిది వంకరలతోఁ బుట్టు మని శపించెను. పిమ్మట నా బాలుఁ డగ్నికల్పుఁడై తల్లి కడుపునఁ బెరుగుచుండెను.