పుట:Maharshula-Charitralu.firstpart.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

మహర్షుల చరిత్రలు


నివారించెను. అష్టావక్రుఁ డట ద్వారపాలునితో సంవాదము చేసి "జ్ఞానము కలిగినవాఁడే వృద్ధుఁడు కాని వయావృద్దు వృద్దా? బాలుఁడైనను జ్ఞాని వృద్దనమానుఁ డగుట మీ రాజు నన్ను నివారింపఁడు, మఱియు, నంధుని త్రోవకును బధిరుని మార్గమునకు. స్త్రీపథముసకును, రాజు వర్త్మనమునకును, బ్రాహ్మణుని యధ్వమునకును, బ్రతిబంధకము కలిగింపరా"దని యాతఁడు శాస్త్రసమ్మతముగ వాదించెను. ఆద్వారపాలుఁ డాతని శక్తిసామర్ధ్యముల కచ్చెరువంది ప్రవేశ మొసఁగెను. జనకునిపాలి కేఁగి యష్టావక్రుఁడు వందితో వాదింతు ననెను. జనకుఁ డాచిఱుతవానిసాహసమునకు మెచ్చియు "నీవంటి బాలుఁడా వందిని గెల్చుట?" యని హేళనము చేసెను. అష్టావక్రుఁడు జనకునితో సంవాదము చేసి తన శక్తిఁ గొంత యాతనికి జూపెను జనకుఁ డాశ్చర్యపడి వందితో వాదింప నాతని కనుజ్ఞ నిచ్చెను. నాఁడు మహా సభాంగణమున బ్రాహ్మణశ్రేష్ఠుల నడుము నష్టావక్రుఁడు వాదమున వందిని డీకొనెను. “అగ్ని యొక్కఁడే ప్రజ్వలించును; సూర్యుఁ డొక్కఁడే ప్రకాశించు; శివుఁడొకఁడే సర్వవ్యాపి " యని వంది ప్రారంభించెను. “ ఇంద్రాగ్నులిద్దఱు మిత్రులు ; నారదపర్వత లిద్దఱు దేవర్షులు; అశ్వినేయు లిద్దఱు రూపవంతులు ; భార్యాభర్తలిద్దఱు సంసార మూలము" లని యష్టావక్రుఁడు బదులు చెప్పెను. ఈ ప్రకార మిరువురు ద్వాదశ సంఖ్యవఱకు సమానముగా వాదించుచు వచ్చిరి కాని, యష్టావక్రుఁ డింకను వాదించి వంది నోడించెను. వెంటనే జనక చక్రవర్తి యష్టావక్రు నభినందించి యాజ్ఞాపిం పుమనెను. అష్టావక్రుఁడు తన తండ్రిని నాతనితో జలమజ్జితులై యున్న బ్రాహ్మణులను విడిపించి వందిని జలమజ్జితునిఁ జేయింపుమనెను. వంది తన తండ్రియగు వరుణదేవుని యజ్ఞమునకై యామిషచే బ్రాహ్మణప్రవరుల నటకుఁ బంపితినే కాని బాధింప లేదని చెప్పి యష్టావక్రు నభినందించి వెడలిపోయెను. నాఁటినుండి యష్టావక్రుని కీర్తిచంద్రిక లెల్లెడల వ్యాపింపఁ జొచ్చెను.