పుట:Maharshula-Charitralu.firstpart.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అగస్త్యమహర్షి

21

అగస్త్యమహర్షిని దూరమునుండి చూచి వింధ్యపర్వతము వెనుకటివలె నొదిగిపోయెను. వెంటనే లోకోపద్రవము తొలఁగి పోయి గ్రహగమనములన్నియు మునుపటివలె జరిగెను. అపుడు పురుషాకృతిఁ దాల్చి వింధ్యపర్వతము అగస్త్యమహర్షి కి సాష్టాంగము లొనర్చి, అతిథిసత్కారములుచేసి “మహానుభావా! భృత్యునాజ్ఞాపించి కటాక్షింపు" మని వేఁడుకొనెను అగస్త్యుఁడు "పర్వత రాజా! మా దంపతుల మిరువురము దక్షిణాపథమునఁ దీర్థములాడఁ బోవుచున్నారము. పెద్దల మైతిమి కావున, నీ శిరశ్శృంగముల నెక్కి దిగుట మాకుఁ గష్టము. కాన, మేము తిరిగివచ్చు వఱకు నీవు భూమి సమముగ నుండవలయును." అని పలికెను. “మహాత్మా ! చరాచర ప్రపంచమున నీయాజ్ఞ చేయనివారెవరు? అట్లే పడియుండెదను. నన్నుఁ గటాక్షింపు" మని వింధ్యము పలుకఁగా అగస్త్యుఁడు సంతసించి వీడ్కొలిపి ముందునకుఁ బోయెను.

వింధ్యపర్వతము సహజముగఁ గల "పెంపుకూడఁ గోల్పోయి మద ముడిగి సిగ్గుపడి చచ్చినట్లు పడియుండెను. అసూయాగ్రస్తుల గతి యింతేకదా!

అగస్త్యుఁడు దక్షిణకాశికిఁ బోవుట

ఈ విధముగా భువనోపద్రవము నరికట్టి అగస్త్యుఁడు దక్షిణ కాశిఁ గన్నఁగాని తన కాశీవియోగబాధ పోఁజాలదని భార్యాసహితుఁడై తీర్థయాత్రలు చేసికొనుచు మందమంద ప్రయాణముల గోదావరీతీరమును బట్టి ఆంధ్ర దేశముఁ జేరెను. పిదప, నాతఁడు పంపా సరోవరము, దండకారణ్యము దాఁటి పట్టిసము, కోటిపల్లి, పతివల మున్నగుచోట్ల విడిసి దక్షవాటముఁ జేరి యట భీమేశ్వరుని భజించి సుఖించెను. పరోపకార పరాయణుఁడైన వానికి సంపదలు పుంఖాను పుంఖము సంభవించును. తీర్థస్నాన జపహోమ దేవతార్చనాదులు పరోపకారమును బోల నేరవు, పరోపకారముకంటెఁ బరమధర్మము