పుట:Maharshula-Charitralu.firstpart.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

మహర్షుల చరిత్రలు

ఆ మాటలు విని అగస్త్యుఁడు ' దేవకార్యసిద్ధికి యత్న మొనరించెదను. కాశీపతి యతనిసతి మనపాలఁ గలరుక దా! భయములేదు పోయి రం' డని వారి నెల్లరను వీడ్కొలిపెను. అగస్త్యుఁని యభయమునకు వా రెల్ల రమితానంద మంది యాతనికిఁ బెక్కు నతులొనర్చి వీడ్కొని నిజనివాసముల కరిగిరి.

వింధ్యగర్వాపహరణము

అగస్త్యుఁడు దేవకార్య నిమిత్తమేయైనను బుణ్యరాశియగు కాశి విడువవలసి వచ్చినందులకుఁ బరిపరివిధములఁ బరితపించి లోపాముద్రాసహితుఁడై యందఱి దేవతలయొద్ద సెలవు గైకొని యెట్ట కేల కెట్లో కాశిని విడిచి కొంత దవ్వడిగి యొక్కచోఁ జతికిలఁ బడి “సాధ్వీ ! సుఖదుఃఖములు కారణములేక మానవులకుఁ గలుగవు గదా! పరమసుఖాకరమైన యా కాశీక్షేత్రమును వీడిపోవలసిన దుఃఖప్రాప్తికి మనమేమి చేసితిమి? కాశ్మీరములందుఁ గుంకుమ మనునది దేశా పేక్ష, పగలు పద్మము రాత్రి కలువపూవు వికసించుట కాలా పేక్ష, పుణ్యాత్మునకు సుఖము, పాపాత్మునకు దుఃఖము అదృష్టాపేక్ష, సర్వము ఈశ్వరాయత్త మనునది ఈశ్వరాపేక్ష, ఈశ్వర ప్రేరణమునఁ గర్మమే సుఖదుఃఖములఁ గూర్చు నని నాయుద్దేశము. ఈశ్వరుఁ డెవనిని రక్షింపఁదలఁచెనో వానిచేఁ బుణ్యకర్మములు చేయించు. ఎవనిని బెఱుపఁదలఁచెనో వానిచేఁ బాపకర్మములే చేయించును. ఈ కర్మలకుఁ గారణ మన్న అవిద్యతోఁ గూడిన రాగద్వేషాదిక్లేశపంచకము. ఈ కర్మఫల మిహపరలోకములఁ బ్రాణు లనుభవించును. కర్మకు హేతువైన క్లేశ పంచక మున్నంతకాలము జన్మము, సుఖదుఃఖభోగము, పునర్జన్మ హేతుకరణము - ఇవి తప్పవు. " అని పలు తెఱఁగుల వాపోయి, కాశిఁ దలఁచి తలఁచి దుఃఖించి మరలఁ బ్రయాణము సాగించి వింధ్యపర్వత ప్రాంతము సమీపించెను.