పుట:Maharshula-Charitralu.firstpart.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

మహర్షుల చరిత్రలు


లేదు. లోకోపకార పరాయణుఁడైన అగస్యుఁడు దాక్షారామమునఁ బరమసౌఖ్యము అనుభవించెను.

పిదప నాతఁడు భార్యాసహితుఁడై వీరభద్ర శిఖరమీక్షించి దాని విశేషము లోపాముద్రకుఁ దెలిపి ముందునకు బయనించి కొల్లాపుర మేఁగి యట లక్ష్మిదర్శనముఁ జేసికొనెను.

ఆగస్త్యకృత లక్ష్మీస్తోత్రము

కొల్లాపురమున అగస్త్యమహర్షి భక్తి భరితుఁడై లక్ష్మి నిట్లు స్తుతించెను. "తల్లీ! నీవు చంద్రునియందు వెన్నెలవు. సూర్యుని యందుఁ బ్రకాశమవు. అగ్నియందు దాహశక్తివి. అట్టి కల్యాణ మూర్తివగు నీకు నమస్కారములు. అమ్మా! బ్రహ్మవిష్ణుమహేశ్వరులు నీ కరుణా ప్రభావముననే సృష్టి స్థితిలయములు జరపుచుందురు. ఇందిరా ! పండితుఁడన్నను, శూరుఁడన్నను, వివేకియన్నను, వదాన్యుఁడన్నను. ధన్యుఁడన్నను. మన్మథుఁడన్నను, కళావిదుఁడన్నను, ఏమన్నను నీ కటాక్షకలితుఁడేకదా, నీ యంశ విశేషమే పురుషులయందు భాగ్యముగను, స్త్రీలయందు వికాసరేఖగను, మఱి సమస్తమునందు సొంపుగను గానవచ్చుచుండును. దేవీ! నీవు కలచోటు రసవంతము, నీవు లేనిచోటు రసహీనము. నీవు కలవాఁడే సమస్తము కలవాఁడు. నీవు లేనివాఁడు ఏమియు లేనివాఁడే. అబ్ది కన్యా ! జలపూర్ణములగు బంగారుకుండలు తొండములతో నెత్తిపట్టి యిరువంకల నేనుఁగులు నిన్నుఁ గొలుచుచుండఁగా, శంఖపద్మమహాపద్మ మక రాజనిధులు నియమమున నిన్నర్చించు చుండఁగా, వింజామరలు తాల్చి దేవగంధర్వ గుహ్యకాంగనలు నీకు వీచోపు లిడుచుండఁగా, మఱియొక వంక నింద్రాది దివిజపతులు చేతులు మోడ్చి స్తుతించుచుండఁగా, పద్మమధ్యమున నిండుకొలువుండి యఖిలలోకములను రక్షించు జగజ్జనని వగు నీకుఁగోటి మ్రొక్కులు." అని పెక్కు