పుట:Maharshula-Charitralu.firstpart.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అగస్త్యమహర్షి

19


చెలగాటమాడును. ఎండతాఁకువేళ ముంగికి త్రాచుపాము పడగవిప్పి గొడుగుగాఁ బట్టును. అచటి కొండగొఱ్ఱెలు కోతులతోఁ బొత్తు గలిగి మెలఁగును. ఇట్టి వింతలు గల అగస్త్యాశ్రమముఁ గన్న దేవతలు పొందిన యానందాశ్చర్యము లనంతములు,

దేవత లగస్త్యుని గొల్చుట

ఇట్లు కాశీనగరమునకుఁగ్రోశమాత్రదూరమందు గంగాతీరమున బ్రహ్మ లోకమును దలదన్ను చు వెలయు అగస్త్యుని పర్లశాలఁజేరి లోపాముద్రాసహితుఁ డగుమహర్షిని దేవతలు కాంచిరి. అగస్త్యమహర్షి యపుడు నిమిషనిమిషమునకు భక్తిపారవశ్యమునఁ బార్వతీ వల్లభుని బహుమనోహర కంఠస్వరమునఁ బలుమాఱు స్తుతించుచుండెను, కొంత - సేపామహాత్ముడు యోగనిరూఢి నుండి పిదపఁ బ్రసన్నుఁ డై పశాంతిముద్ర ధరించి యున్న సమయమున జయజయధ్వానములతో సురలాతనిఁ జేరి మ్రొక్క నాతఁ డెదు రేఁగి వారందఱకు సత్కారము లొనర్చి సుఖాసీనులఁ గావించి వచ్చినపని యడిగెను.

బృహస్పతి ఆగస్త్యునితో వచ్చినపనిఁ దెల్పుట

దేవత లెల్లరికోరికపైని బృహస్పతి అగస్త్యునికి నమస్కరించి స్తుతించి ప్రక్కనున్న లోపాముద్రాసాధ్విని బ్రస్తుతించి యిట్లనెను. "మునిచంద్రా ! నీవు ప్రణవమవు, ఈమె వేదవిద్య, నీవు తపస్సువు. ఈ సాధ్వి శాంతి. నీవు ఫలము. ఈమె సత్క్రియ. నీవు సూర్యుఁడవు. ఈమె చైతన్యలక్ష్మి. నీయందు బ్రహ్మతేజము, ఈమెయందుఁ బతివ్రత తేజము ప్రజ్వరిల్లు చున్నది. ఈయుభయ తేజఃపుంజము మారు క్షేమ మొసంగును." అని వింధ్యవృత్తాంతము. సూర్యచంద్రాదుల గమన మాఁగిపోవుట, దానివలన లోకముసకుఁ గలిగిన మహావిపత్తును సమస్తముఁ దెలిపి యావచ్చిన దేవతాధిపులను బేరు పేరఁ జూపి వింధ్యగర్వ ముడిసి యిందఱకు మేలు చేయుమని యర్థించెను.