పుట:Maharshula-Charitralu.firstpart.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

మహర్షుల చరిత్రలు


దాయెను. వారంత బ్రహ్మపాలి కరిగి యంతయుఁ జెప్పి తమ్ముఁ గాపాడఁ గోరిరి. బ్రహ్మ యాపని తనవలనఁ గాదని, అవిముక్తక్షేత్రమునఁ దపము చేసికొనుచున్న అగస్త్యమహామునియే వారిని రక్షింప సమర్థుఁడని పోయి యాతని సేవింపుఁడని తెలిపెను. అది విని దేవతలు బ్రహ్మ చెప్పినచొప్పున బయలుదేఱి భూలోకమునకు దిగి కాశీ పట్టణముఁ జేరి పిదప :

"పంచాక్షరీ మంత్ర పారాయణమునకు
          నెవ్వానిమానసం బేడుగడయు
 దర్పోద్దతు లగువాతాపీల్వలులకును
          వధశిలాస్థాన మెవ్వావికుక్షి
 ఆది నెవ్వానిదివ్యావతారమునకుఁ
          బూర్ణాంబుభాండంబు పురిటియిల్లు
 మెఱసి లోపాముద్ర మెఱుఁగుఁ బాలిండ్లపైఁ
          బవళించు నెవ్వావిభవ్యమూర్తి

 కసరి యెవ్వావికంఠహుంకారరవము
 కొండచిలువకులమ్ములోఁ గూల్చె వహుషు
 నట్టిపరమమహాతేజు నలఘుతేజు
 వెదకి రానందవనములో విబుధమునులు."
                                          (కాశీ, 2, 40)

పిమ్మట, నటఁ గాననైన పెద్దలవలనఁ గందువ యెఱఁగి నెమ్మదిగా వారగస్త్యమహార్షి యాశ్రమమును బ్రవేశించిరి.

అగస్త్యాశ్రమ వర్ణనము

అగస్త్యుని పుణ్యాశ్రమములో దివ్యమహిమము లెన్నో విరాజిల్లుచుండెను. అచట నాఁడేనుఁగు తొండమెత్తి సింహపుఁ బిల్లను లాలించును. తన వాఁడిగోళ్ళతోఁబులి లేడిపిల్ల మొగమె త్తి ముద్దాడును. తోడేలు చింబోతుల బిగికౌఁగిటఁజేర్చి ప్రేమచూపును.