పుట:Maharshula-Charitralu.firstpart.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



మహర్షుల చరిత్రలు

జమదగ్ని మహర్షి

జమదగ్ని జవనవృత్తాంతము

తొల్లి భృగువంశసంజాతుఁడగు ఋచీకమహర్షి కుశిక వంశోద్భవుఁడగు గాధిరాజుకూఁతురు సత్యవతి యనునామెను వివాహమాడఁ గోరి తనకోరికను గాధికిఁ దెలిపెను. గాధి యాతఁడు తన కూఁతునకు దగినవరుఁ డగునో కాదో యని సంశయించి తెల్లని దేహము నల్లనిచెవులు గల వేయిగుఱ్ఱములను దనకూఁతున కుంకువగా నొసఁగినచో సత్యవతినిచ్చి పెండ్లి చేయుదు నని సమాధానము చెప్పెను. ఋచీకమహర్షి యిది యెంతపని యని బయలుదేఱి వెడలి వరుణదేవుని బ్రార్థించి యాతనిచే నట్టి యశ్వములను బడసి తీసికొనిపచ్చి గాధి కిచ్చెను. గాధిరాజు ఋచీకుని శక్తి సామర్థ్యములకు మెచ్చుకొని యాతనికి దనకూఁతురగు సత్యవతినిచ్చి మహా వైభవముతో వివాహముచేసి యల్లునిఁ గూఁతును వారి యాశ్రమమునకుఁ బంపివేసెను. సత్యవతి భర్తయే దైవమనియుఁ దనయదృష్టముచే నుత్తమబ్రాహ్మణుఁడు తనకు భర్తయాయెననియు నెంచి యాతని కనేకవిధములఁ బరిచర్య చేయుచుండెను. ఒకనాఁడు ఋచీకమహర్షి యామెసేవకు సంతసించి యొక కోరిక గోరుకొనుమనెను. సత్యవతి పుత్త్రహీను లగు తనతలిదండ్రులకొక కొమరుని, దనకొక పుత్త్రుని నిమ్మని భర్తను బ్రార్థించెను. ఋచీకమహర్షి యట్లేయని రాజబ్రహ్మ మంత్రములచే రెండుచరువులను వేల్చి యారెంటిని భార్య కిచ్చి “సాధ్వీ! క్షత్త్రియాజేయుఁడు క్షత్త్రియసూదనుఁడు నగు క్షత్త్రియోత్తముఁడు మొదటిచరువు నుపయోగించినవారికిఁ గల్గును. కాన, దానిని మీయమ్మ కిమ్ము. ఈ రెండవచరువు నీ వుపయోగింపుము.