పుట:Maharshula-Charitralu.firstpart.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

మహర్షుల చరిత్రలు


దానివలననీకుఁ దపోధృతిశమములచే నుత్కృష్టుఁడగు బ్రాహ్మణుఁడు జన్మించు" నని చెప్పి నదీస్నానమునకుఁ బోయెను.

ఇంతలో సుతాజామాతలం జూడఁ దలఁపు కలిగి గాధి భార్యాసమేతుఁడై ఋచీకుని యాశ్రమమునకు వచ్చెను. సత్యవతి యానంద పరవశతఁ తల్లిదండ్రులు రాఁగానే తల్లికాచరు వృత్తాంతమును దెల్పి దైవోపహతయై తానుపయోగింప వలసినది తల్లికిచ్చి తల్లికీయ వలసినది తాను గ్రహించెను. ఇంతలో ఋచీకమహర్షి వచ్చి యత్త మామలఁ దివ్యభోదమున జూచి మాతాసుత లొనరించిపననిఁ దెలిసికొని సత్యవతిని జూచి " నీకు క్షత్త్రియాంతకుఁడు మహాక్రూరుఁడగు కొడుకు పుట్టును. మీయమ్మకు బ్రహ్మభూతుఁడు తపోధనుఁడు నగు కొడుకు పుట్టు" నని చెప్పెను. సత్యవతి భయవడి యదేమని యడగఁగా ఋచీకుఁడు " నేను నీకుత్తమ బ్రాహ్మణుఁడు పుట్టునట్లు మీతల్లికుత్తమ క్షత్త్రియుఁ డుదయించునట్లు మంత్రములఁ జదివి వేల్చి యాచరువులు జేసితిని నీవుపయోగింప వలసినది మీ జననియు నామెయుపయోగింప వలసినది. నీవు నుపయోగించితిరి. కావున నట్లు వ్యత్యాసము కలుగు" నని చెప్పెను. సత్యవతి భయపడి క్రూరుఁడగు కొడుకును గనఁజాలను రక్షింపు మని వేఁడుకొనఁగా ఋచీకుఁడామెను గరుణించి యా విశేష మామె కుదయించు పుత్త్రునకుఁ గాక పౌత్త్రునకుఁ గల్గుననియెను. అంత గాలక్రమమున సత్యవతి గర్భమున జమదగ్ని మహర్షియు నామె మాత్రుగర్భమున విశ్వామిత్రుఁడును జన్మిఁంచిరి.[1]

జమదగ్ని రేణుకను వివాహమగుట

ఇట్లు జన్మించిన జమదగ్ని యుత్తమగుణసంపన్నుఁడై రేణువు కూఁతు రగు రేణుకను వివాహమాడి - గార్హస్థ్యమును నడుపు చుండెను. ఈతఁడు తన తపోమాహాత్మ్యమున ఒక హోమధేనువును

  1. భారతము; విష్ణుపురాణము.