పుట:Maharshula-Charitralu.firstpart.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

మహర్షుల చరిత్రలు


రావణు చెల్లెలిని వివాహమాడెను. ఆమె యందాతనికి లవణుఁడను రాక్షసుఁడుదయించి మథుఁడు చనిపోయిన పిమ్మట నాశూలమును గ్రహించి పూజించుచుండెను. లవణాసురుఁడు పెరిగిపెద్దవాఁడై మహర్షుల కనేకబాధలు కలిగించుచుండెను. ఈ లవణాసురుని జంపించు టెట్లని మరీచి కశ్యప దళాద పులస్త్య ఋచీకాది మహర్షులు వచ్చి చ్యవనమహర్షి నుపాయ మడిగిరి. చ్యవనమహర్షి వా ఱందఱతోఁ గలసి శ్రీరామునికడ కేఁగి లవణాసురుని దారుణవృత్తాంతమును జెప్పఁగా శ్రీరాముఁడు శత్రుఘ్నుని లవణాసురవధకై పంపెను. చ్యవనుఁడు శ్రీరాముని స్తుతించి మహర్షులతోఁ దన యాశ్రమమున కేఁగెను. శత్రుఘ్నుఁడు సేనాసమేతుఁడై బయలుదేఱి పోవుచు వాల్మీకి యాశ్రమమున నొకరేయి గడపి నాఁడే సీతామహాసాధ్వి కుశలవులఁ గన్నదన్న శుభవార్త విని చ్యవనమహర్షి యాశ్రమమునకు వచ్చెను. చ్యవనుఁడు నాతని నాదరించి లవణాసురుఁడు మాంధాతను జంపిన తెఱఁగుఁ జెప్పి శూలము చేతలేని సమయముననే లవణునిఁ జంపుమని శత్రుఘ్నునకు బోధించెను. శత్రుఘ్నుఁడు చ్యవనునిమాట విని లవణాసురుని జంపిన పిదప మునులందఱును బ్రీతులై యథేచ్ఛముగా సంచరింపఁ దొడఁగిరి.[1]

సింహావలోకనము

భృగువంశవరిష్ఠుఁడై చ్యవనమహర్షి మహాతపోనిష్ఠాగరిష్ఠుఁడై యాత్మతపోబలసంపన్నతచే లోక హితార్థియై మన ఋషులలో నగ్రేసరుఁడై చెలువొందెను.



  1. ఉత్తరరామాయణము.