పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ ప్రకరణము.

5

దజ్యోత్న నాహృదయమున ప్రకాశించుచుండెను. తెల్లవారుజామున అవ్వను చూచుటకు గంగాతీరమునకు పోయి ఉంటిని. అప్పుడామె కొనయూపిరితో నుండెను. ఆమెను గంగ మధ్యకు నావపై గొనిపోయి, “గంగా నారాయణబ్రహ్మ!” యని ఉచ్చైస్వనమున నుచ్చరించుచుండిరి. ఆమె తనహస్తమును వక్షస్థలమున నుంచుకొనియుండెను. అనామికాంగుళము ఊర్ధ్వముఖముగా నుండెను. ఆ వేలును గుండ్రముగాత్రిప్పుచు “హరిబోల్! హరిబోల్” అనుచు అట్లే పరలోక గామియయ్యెను. ఇది చూడగా, ఆమెమరణ సమయము నందు నాతో, “అడుగో, పరమేశ్వరుడు, అతడే నీకు ముందుగతి,” అని వ్రేలెత్తి చూపుచు చెప్పినట్లు తోచెను. ఇహమున నెట్లో పరమునను అవ్వయే నాకు పరమ మిత్రురాలు.

ఆమెశ్రాద్ధము బహువైభవముతో జరిగినది. దేహమునందంతటను చమురు పసుపు పూసికొని శ్రాద్ధముయొక్క •[1] వృష కాష్టమును గంగాతీరమున పాతిపెట్టితిమి. ఈదినములలో మాయింట చాల ‘తొడతొక్కిడి’ గానుండెను. అవ్వచనిపోవుటకు పూర్వపురాత్రి నేను పొందిన ఆనందమును పిమ్మట తిరిగి అనుభవమునకు దెచ్చుకొనుటకు అనేక సారులు ప్రయత్నించితిని. కాని మరెన్నడును పొందలేకపోతిని. నాటి రాత్రి ఔదాస్యముతోను ఆనందముతోను నిండియుండిన నామనసు ఇపుడు ఔదాస్యముతోను విషాదముతోనునిండెను. ఆయానంద మంతరించుటతోడనే మనసునందొక విధమగు అసంతుష్టి ప్రవేశంచెను. నాటి ఆనందమును మరల నెట్లు సంపాదింపగలుగుదునా యని నామనసు నందొక గొప్ప వ్యాకులత జనించెను. ఇక దేని యందును నాకిష్టమ లేకుండెను. అప్పటి నాయవస్థ భాగవతమునందలి యొక ఉపాఖ్యానముతో పోల్చవచ్చును.

  1. పైన నొక వృషభ చిహ్నముగల యొక యజ్ఞస్తంభము.