పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

మహాపురుషుల జీవితములు

అతఁడు ధన మార్జించు నుపాయ మెంత బాగుగ నెఱిఁగి యుండెనో పాత్రాపాత్ర మెఱిఁగి బీదలనిమిత్తము దానిని వినియోగించు నుపాయము నంతబాగుగనే యెఱింగియుండెను. పునహా బొంబాయి సూరతు మొదలగు పట్టణములు ఘూర్జర దేశమునందలి నవసారీ మొదలగు గ్రామములు చూచినవారికి జీజీభాయి యొక్క యౌదార్యము భూతదయాళుత్వము తప్పక తెలియును. కృపాసముద్రుఁడగు నీపారసీ కులస్థుడు మహారాజు లిచ్చినట్లు మితిమీరిన ధనరాసులు దానములిచ్చి ధర్మవైద్యశాలలు పాఠశాలలుఁ చెరువులు, సత్రములు, బాటలు, నూతులు మొదలగువానిని నిర్మింపఁ జేసి లోకోపకార పారీణుఁ డయ్యెను. ఈదానములు చేయుటలో జాతి మత వర్ణ భేదముల నతఁడెన్నడు పాటింప లేదు. ఈదానకర్ణునికీర్తి సకలదేశవ్యాప్తమగుటచే శ్రీ విక్టోరియా మహారాజ్ఞిగారు వాని యౌదార్యమునకు మెచ్చి 1842 వ సంవత్సరమున నైటను బిరుదము నిచ్చెను.

అత్యంతగౌరవసూచక మగునీబిరుదు పొందినవారిలో హిందూదేశమున జీజీభాయియే మొట్టమొదటివాఁడు. ఆబిరుదు వచ్చినప్పుడు వానిస్వకులమువారగు పారసీలు చాల సంతసించి వానిని గౌరవించిరి. ఆబిరుదమును వాని కిచ్చినపుడు బొంబాయి గవర్నరు గారగు సర్ జార్జీ ఆండ్రసన్ దొరగారిట్లు పలికిరి "నీవు రాజు లిచ్చినట్లు దానము లిచ్చి మానవకోటి దుర్దశను దొలఁగించి యీ యపూర్వగౌరవమునకుఁ బాత్రుఁడవయితివి" 1843 వ సంవత్సరమునం దతఁడు బ్రిటిషుగవర్నమెంటువారివలన నొక బంగారుపతకమును బహుమానముగఁ బడసెను. అమితమగు దేశాభిమానము నౌదార్యము కలుగువాఁడగుటచే వాని కాపతక మీయఁబడినట్లు దానిమీఁదనే వ్రాయబడియున్నది. అప్పటి బొంబాయి గవర్నరు