పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సర్. జేమ్సేట్జీ జీజీభాయి

165

గారగు సర్ జార్జి ఆర్తరుదొరగా రాపతకమును ఆయన కిచ్చునప్పుడిట్లనిరి. "నీవు దేశోపకారార్థము కేవల సత్కార్యముల నిమిత్తమే తొమ్మిదిలక్షలరూపాయిలు దానము చేసియుంటివని యనేకులవలన వినియుంటిని. ఇట్టి యౌదార్యము దేశాభిమానము సూచించు ధర్మకార్యములను శ్రీరాణిగారు తగునట్లు గుర్తెఱుంగుదురుగాక."

అతని ధర్మకార్యములు ప్రత్యేకముగ నొకజాతికి నొక దేశమునకు యేర్పడియుండ లేదు. ఆంగ్లేయసైనికులు స్వదేశము సిపాయిలుగూడ మంచునెలవులగు కాబూలు కొండలనడుమ యుద్ధ భూములకు బలియగుచున్నప్పుడు ఐర్లండునందును స్కాట్లండునందును గాటంబులగు కాటకంబులచే జనములు మలమలమాడి హాహా కారములతో నలమటబడినప్పుడుఁ క్రిమియాయుద్ధమునందు దిక్కు లేక శూంశిఖామణు లనేకులు నిహతులైనప్పుడు ననాధలగువారి భార్యలు బిడ్డలు దురవస్థ ననుభవించుచుండ వెనుదీయక యీదాన కర్ణుఁడే గొప్పసహాయములఁ జేయుచు వచ్చెను. ఫ్రాన్సుదేశమున 1856 వ సంవత్సరమున నొకనదిపొంగి దేశమునకు మిక్కిలి చెరుపు చేసెను. ఆవరదవలన విపత్తులఁ బడినవారికిఁ బంచిపెట్టుమని యిక్కడనుండి యైదువేల రూపాయిలంపెను. ఆమహోపకారమునకు ఫ్రెంచివారు మిక్కిలి సంతసించి వానికిఁ గృతజ్ఞులయి వందనములఁ జేసిరి.

1856 వ సంవత్సరమున జీజీభాయియొక్క విగ్రహమొకటి నిర్మించి బొంబాయినగరమునఁ బెట్టవలయునని జనులు సభచేసిరి. ఆ సభకప్పటి గవర్నరు గారగు నెల్ఫినిష్టన్ ప్రభువుగా రగ్రాసనాధిపతిగా నుండిరి. ఆవిగ్రహమునకు రమారమి యేఁబదివేలరూపాయి లయినవి, ఆతఁడిప్పుడు లేక పోయినను వానికీర్తి దేహమో యన్నట్లా విగ్రహ మిప్పటికిని బొంబాయి పురమందిర మలంకరించు చున్నది.