పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

మహాపురుషుల జీవితములు

సిటీవారు వానికి డాక్టరను బిరుదము నిచ్చిరి. డాక్టరుశబ్దమున కిక్కడ వైద్యుడనే యర్థముగాదు. డాక్టరనఁగా పండితుఁడు. ప్రకృతి శాస్త్రము. ధర్మశాస్త్రము మొదలగు వానియం దసాధారణప్రజ్ఞఁగల పండితులకుఁ దరుచుగా నిట్టి బిరుదములు విద్యాశాఖావా రిచ్చు చుందురు. దొరతనమువారు వానియందుఁ దమకుఁగల గౌరవమును బట్టి సి. ఐ. ఇ, రావు బహదూరు రాజాయను బిరుదముల నిచ్చిరి. 1877 వ సంవత్సరమునందు జరిగిన దర్బారులో సర్ ఆష్లీఇడెం దొరగారు రాజేంద్రలాలునితో నిట్లనిరి. "కోర్టుఆఫ్ వార్డ్సువారి యధీనమునం దుండిన మైనరు జమీందారుల విద్య మీచేతిలో నుంచఁబడినది. అందుచేత బంగాళమునందున్న జమీందారులలో ననేకులు మీ ఋణమును దీర్చుకొనజాలరు. మీరు సంస్కృత భాషలో నధికపాండిత్యము సంపాదించి జగద్వ్యాప్తమైన కీర్తిని సంపాదించినారు. మీప్రజ్ఞ లన్నియు నెఱిఁగి దొరతనమువారు మీకు రావుబహదూరు బిరుదము నిచ్చినారు."

తన దేశస్థుల కెపుడైనకూడనియపకారము జరిగినపుడు దానిని బయలుపెట్టి మిక్కిలి కఠినోక్తులతో దానింగూర్చి ప్రశంసించుచువచ్చెను. దీనికొక్క యుదాహరణము చెప్పవలసియున్నది. నీలిమందుతోటల యజమానులు బంగాళాదేశమునందలి రహితుల కొత్తుడు గలుగఁ జేసి బాధించినపుడు రాజేంద్రలాలు దిక్కుమాలిన రహితులపక్షముఁ బూని తోటల యజమానుల ప్రవర్తనము సరిగా నుండలేదని కలకత్తాలో నొకమహాసభలోఁ బలికెను. ఇట్లతఁడు బహిరంగమైనసభలో తమ్ము నిరసించినాడనికోపించి నీలిమందుతోటల యజమానులగు నాంగ్లేయులు కొందఱు కడుపుమంట తీరక పోటోగ్రాఫిక్కు సంఘమున జేరి రాజేంద్రలాలుమైత్రుని సంభాషణము సరిగా నుండ లేదని ఖండించి యతని నా సంఘములోనుండి తొలఁగింప బ్రయత్నించిరి.