పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజేంద్రలాలుమైత్రా

109

రాజేంద్రుఁడు సంఘములో చిరకాలమునుండి సభ్యుడుగా నున్నందున వానిం దీసివేయుటకుఁ వీలులేక యా దొరలు తుదకిట్లు తీరుమానము చేసికొనిరి. "నగరమందిరమున రాజేంద్రలాలు మైత్రుఁడుచేసిన యుపన్యాసమునందలి మాటలఁ నీ సంఘమువారు విని యందు మొదటినుండి చివరవఱకుఁ నబద్ధములే యుండుటచేత నట్టి యుపన్యాస మిచ్చి నతడీ సంఘములో సభికుఁడుగా నుండుటకు తగఁడని నిశ్చయించి యట్టివానిం దీసివేయుట కిప్పటి నిబంధనలలో నేవియు నాధారములు గనబడకపోవుటచే రాజేంద్రలాలు తనంతట తానే యీ సంఘమునుండి మానుకొనవలయునని యిందుమూలముగా తెలియజేయు చున్నారు."

మేజర్ థల్లియర్ దొరగారు రాజేంద్రుని పక్షముబూని యతనివలన లోపము లేదనియు ననేకపర్యాయములు నాంగ్లేయులు పెక్కండ్రు హిందువుల నింతకంటె నెక్కుడు కఠినోక్తులతో నిందించిరనియు రాజేంద్రలా లాంగ్లేయుల నందఱిని తిరస్కరింప లేదనియు తప్పుచేసిన నీలిమందుతోటల యజమానులనే నిరసించెననియు సంఘము వారట్లు తీర్మానము చేయఁగూడదనియు వాదించెను. హ్యూము దొరగారు మొదలగు కొంద ఱాంగ్లేయులు థల్లియరు దొరగారితో నేకీభవించిరి. కాని యా సంఘమువారిలో నెక్కువమంది రాజేంద్రునకుఁ బ్రతిపక్షులుగా నున్నందున వారిమాటలు సాగవయ్యె. అది కారణముగ రాజేంద్రలాలుతోపాటు థల్లియరు దొరగారుకూడ నా సంఘము విడిచిరి.

అతని మరణాంతరమున వానింగూర్చి వ్రాసిన స్వదేశ పత్రికలు రాజేంద్రలాలుమైత్రుఁడు రామమోహనరాయలు కంటెను,