పుట:Mahaakavi dairiilu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గురజాడ రచనలు

8


12 జనవరి, శనివారం :

ఇంకా మార్గమధ్యంలోనే వున్నాము. నంద్యాల దాటింది రైలు. నంద్యాల ప్రాంతం సొగసుగావుంది. కొత్తగా బాగుచేసి దున్నిన అడవిప్రదేశం చాలాకనబడుతూ వుంది. ఆముదపుపైరు; కంది వ్యవసాయం కనబడదు. ఈ జాతి ఆముదపుమొక్కలే యీ భూమిలో ఎక్కువగా పెరుగునుకాబోలు! కంకరభూమి. ఎక్కడ చూసినా ఆముదాలపైరే!

13 జనవరి, ఆదివారం :

ఉదయం మద్రాసు చేరుకున్నాము. అడ్మిరాల్టీహౌసు. అందమైన భవనం. మహారాజావారు, బిల్డింగంతా మాకు చూపించారు. తమ ఉద్దేశాలను, ఊహలను, ఆశయాలను, విధానాలను కొంతవరకు మాకు వివరించారు. భూములమీద, భవనాలమీద డబ్బు పెట్టుబడిపెట్టడం, దానికిగల ప్రాధాన్యత. మెట్రొపాలిస్‌లో మొట్టమొదటసారిగా భవనంకొన్న మహారాజా యీయనే. మిగిలిన రాజులుకూడా యీయన్ని అనుసరిస్తారనుకుంటాను. అయితే 'సిటీ' అభివృద్ధి అవుతుంది. మహారాజావారి భవనం, మద్రాసులోకల్లా దివ్యమైనదని అంతా పరిగణిస్తున్నారు. ఇందుకు శ్రీ బాలయ్యనాయుడిగారిని అభినందించక తప్పదు. మహారాజాకు తగినభవంతి.

14 జనవరి, సోమవారం :

అడ్మిరాల్టీహౌస్‌వలె*[1]పూల్‌బాగ్‌ను ఎందుకు అభివృద్ధి పరచకూడదు? భవనంమాటకాదు; తోట సంగతి.

  1. *విజయనగరంలో వున్న పెద్ద పూలతోట. చూ. అప్పారావుగారి 'మీ పేరేమిటి' అన్న కథ.