పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


బారులను కోరియలేనస్సువద్దకుఁ బంపిరి. అతఁడు సంధికి నొప్పుకొనలేదు. అంతట రోమను లతని తల్లి 'వలుమ్నియా'ను సంధి చేయుటకుఁ బంప, యామె వెళ్లి, “నాయనా, నీవు మమ్ము విడనాడి వెళ్లినది మొదలు మా దురవస్థ చెప్పుటకు వీలులేదు. నీవు రెండు కక్షలవారికి సమాధానము చేయవలెను. లేనిపక్షమున నీ కన్నతల్లిని ముందు సంహరించి రోముపట్టణమును ముట్టడివేయు"మని యతనితోఁ జెప్పెను. అతని దారాపుత్రాదులు పాదాక్రాంతులైరి. వెంటనే నతని మనస్సు కరిగి వాల్సియనులను విడిచి, రోమనుల కమందానందమగునట్లు రోముపట్టణములోఁ బ్రవేశించెను. .

కోరియలేనస్సును దండనాయకుఁడుగ వాల్సియనులు నియమించిరి. 'టల్లసు' మొదలగు శత్రుపక్షమువారు కినిసి యతఁడు చేసిన స్వామిద్రోహమునకు తగిన కారణములను నిరూపించి సేనాధిపత్యమును వదిలివేయవలసిన దని యతనికి వర్తమానముఁ బంపిరి. వాల్సియనులు సభచేయ నతఁ డక్కడకుఁ బోయి, తాను చేసినపనికి సమాధానము చెప్పుచుండ 'టల్లసు' మొదలగువారు లేచి యతనిని కత్తులతో పొడిచి చంపివేసిరి. సెనేటుసభవారు, రోమను లీ వర్తమానము విని పరితోషించలేదు; పరితపించ లేదు.