పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


డగు 'ఫిలిప్ప'నునాని కార్యముల నితఁడు తృణీకరించుటకలదు. అందుచేత నతఁ డితని నందఱికంటె విశేషముగ సన్మానించి, యితని ప్రశంసలను ముఖ్యాలోచనలోనికిఁ దెచ్చి వానికి యుక్తముగఁ బ్రతివచనముల నిచ్చుచుండెను. 'ఫిలిప్పు' యొక్క సభకు రాయబారిగ నలుగురితో నితఁడు గలిసి వెళ్లినపుడు వారిలో నితఁడు విశేషముగ గౌరవమునొందెను. డెమాస్తనీసు తన వాక్చాతుర్యము చేత స్వదేశీయులను ఫిలిప్పుతో పోరాడు నటులఁ జేసెను. ఈ జగడము కొంతకాల మతిక్రమించెనుగాని తుదకు ఫిలిప్పునకు జయముకలిగెను. ఈ పరాభవము కలిగినందులకుఁ గొంద ఱితనిని దూషించిరిగాని తుద కతఁడు నిర్దోషి, యని జనులు ప్రకటనఁ జేసిరి. వీరస్వర్గము నొందినవారివిషయమై చేయవలసిన ప్రసంగముల నితనిని జేయుమని ప్రజలు వేఁడుకొనిరి.

ఫిలిప్పు కాలములోనే కాక వాని కుమారుఁడైన మహా అలగ్జాండరు కాలములోఁగూడ నితఁడు స్వదేశమువిషయమై పాటుపడెను. కాని నీచదశసంప్రాప్త మైనందున నతని శత్రువుల విజృంభణ సహింపలేక, వారికి లోఁబడవలసివచ్చునని యెంచి, విషముఁ ద్రావి డెమాస్తనీసు దేహత్యాగముఁ జేసికొనెను.

ప్రపంచములోఁ బుట్టిన మహావక్తలలో శ్రేష్ఠుఁడనఁదగు డెమాస్తనీసుయొక్క వాక్చాతుర్యము మిగుల సంస్తవనీయము.