పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గారి కొకయుత్తరము వ్రాసియిచ్చిరి. అంతట మేము వసతి గృహము చేరి భోజనముచేసి కళాశాల ప్రిన్సిపల్‌గారైన డాక్టర్ మిల్లర్‌గారిని కళాశాలలోనే దర్శించి, డబ్లియు. రామయ్యగారిచ్చిన ఉత్తరము నిచ్చితిమి. వారు సంతసించి మీరు ఎఫ్. ఏ., జూనియర్‌లో చేరుట మంచిదని మాకు సలహానిచ్చిరి గాని మేము జూనియర్‌లో గతసంవత్సరమే యున్నాముగనుక ఈ సంవత్సరము సీనియర్‌లో చేర్చుకొనవలెనని కోరితిమి. అందుకు సమ్మతించి మమ్ము ఎఫ్. ఏ., సీనియరులోనే చేర్చుకొనెను.

పరస్థలమునుంఛి వచ్చిన విద్యార్థులనిమిత్తము మిల్లరుదొర 'స్టూడెంట్స్ హోమ్‌' అనుపేరుతో నొక విద్యార్థివసతిగృహమును తనస్వంతద్రవ్యముతో కట్టించెను. ఆగృహములో మేము చెన్నపట్టణమువెళ్లిన కొలదిదినములకే గృహప్రవేశము జరిపితిమి.

మేము మాపెద్దలతో చెప్పకే చెన్నపట్టణము ప్రయాణము చేసి, అక్కడ చేరినపిదప, కాలేజీలో చేరుచున్నాము గనుక సొమ్ముపంపవలసినదని ఉత్తరమువ్రాయగనే వారికి మే మిచ్చటికి బోవుట యిష్టము లేకపోయినను వెంటనే సొమ్ముపంపిరి. మాకు అన్నియు సుఖముగనే జరుగుచుండెను.

ఇంగ్లీషు, తెలుగు, చరిత్ర, శరీరశాస్త్రము మొదలగువానియందు అభిరుచికలవాడైనను లెక్కలనిన నాకు తలనొప్పి. కనుక బీజగణితము (Algebra) క్షేత్రగణితము (Geometry) (Trignometry) లలో పుస్తకములలోనిభాగము (Book work)