పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెన్నపట్టణములో చదువనిశ్చయించుకొన్నందుకు మమ్ము నభినందించెను. ఆకాలములో ఈప్రాంతములనుండి చెన్నపట్టణములో చదువబోవువారు మిక్కిలి అరుదుగా నుండిరి. అంతకు మునుపు గుంటూరులో మెట్రిక్యులేషన్‌లో కృతార్థులైనవారి సంఖ్య మిక్కిలి స్వల్పము. అందు పైపరీక్షకు చదివినవారొక్కరో యిరువురో యుండిరి. చెన్నపట్టణమునకు పోయినవారెవ్వరు లేరనియే చెప్పవచ్చును. కనుక మేము చెన్నపట్టణమునకు బోవుట సాహసకృత్యముగనే తలంచవచ్చును.

మూడవదినము ఉదయమున చెన్నపట్టణపు రేవునకు స్టీమరు చేరెను. నేను ప్రయాణములో రెండవరోజుమాత్రము పెరుగులో నానిన అటుకులు కొలదిగా తిని నీళ్లుత్రాగితిని. చెన్నపట్టణము చేరునప్పటికి శరీరము బలహీనముగానున్నను తేటచిక్కినది. ఉల్లాసముగాగూడ నుండెను. చెన్నపట్టణము వంటి మహాపట్టణమును దర్శించుట అదియె ప్రధమముగాన అంతయు విచిత్రముగను వినోదముగను గనుపించుచుండెను. మేము స్టీమరుదిగుటతోడనే కూలీలు మొదలగువారు మాటలాడు అరవభాష శ్రుతికటువుగ తోచెను. మేము రేవునొద్ద నుండి సరాసరి రాయపురములో శ్రీ డబ్లియు. రామయ్యగారి యొద్దకు బోయి మేము వచ్చినపని చెప్పి, మాకర్ల సుబ్బారావునాయుడుగా రిచ్చిన ఉత్తరము వారిచేతి కిచ్చితిమి. వారు దానిని చూచుకొని మమ్ము ప్రేమతో ఆదరించి లింగిచెట్టి వీధిలో విద్యార్థులవసతిగృహములో ప్రవేశమునకు చీటియిచ్చి మమ్ము ఎఫ్. ఏ. క్లాసులో చేర్చుకొనుటకు డాక్టరు మిల్లరు