పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాత్రము గట్టిగా నేర్చుకొనుచుంటినిగాని (problems)ప్రాబ్లములు చేయుటలో బొత్తుగ నసమర్థుడుగ నుంటిని. ఈకారణముననో మరి జూనియర్‌క్లాసులో బాగా చదువని కారణముచేతనో ఆసంవత్సరము ఎఫ్. ఏ., పరీక్షలో నెగ్గలేదు. హనుమంతరావును తప్పిపోయినాడు. కాబట్టి మరల యఫ్. ఏ., సీనియర్‌లో చదువవలసివచ్చెను. ఈసారి పరీక్షలో ఇరువురము కృతార్థులమైతిమి. 1888 - వ సంవత్సరములో బి.ఏ. లో ప్రవేశించితిమి. నేను బి.ఎల్. చదువవలెనని దృఢనిశ్చయముతో నున్నాను. ఫిలాసఫీ (తత్త్వశాస్త్రము) అభిమాన విషయముగా నేను చదువుటకు నిర్ణయించుకొంటిని. హనుమంతురావు గణితములో ప్రవేశము గలవాడగుటచేత ఫిజిక్సు (physics) చదువుటకు నిశ్చయించుకొనెను. తిరునారాయణస్వామిగూడ క్రైస్తవకళాశాలలో జేరి ఎఫ్. ఏ. మొదటితరగతిలో ప్రవేశించినాడు. అప్పటికే వివాహితుడై యుండినందున తనకుటుంబమును రప్పించుకొని తండియార్‌పేటలో కాపురము ఏర్పరచుకొని యుండెను. మెట్రిక్యులేషన్‌లో మాతోడనే ఉత్తీర్ణుడైన నాసహాధ్యాయి కోడూరు చంద్రశేఖరము మిక్కిలి బీదవాడగుటచేత ఎఫ్. ఏ. లో జేరుటకు అవకాశము లేకపోయెను. కాని రెండుసంవత్సరములు గడచినపిమ్మట అతడు ఎట్టులో చెన్నపట్టణము జేరి తిరువళ్లి క్కెణిలో ఉద్యోగములలోనున్న తెలుగువారియిండ్లలో వారములేర్పరచుకొనియు, కొన్నిరోజులు స్వయముగ వంటచేసుకొని భోజనముచేయుచు ఎఫ్. ఏ. క్లాసులో క్రైస్తవకళాశాలలోనే చేరి చదువనారంభించెను. కాని జరుగుబాటు మిక్కిలి కష్టముగ నుండెను. మాటిమాటికి నన్ను కలియుచు తన కష్టములు చెప్పుకొనుచుండెను. నాకైనను మా