పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని ఆయాశ నిరాశయయ్యెను. మరెవ్వరును ఆభారమును పైనబెట్టుకొనుటకు సమ్మతించకుండిరి.

ఇట్లుండగా, భారతదేశసేవాసంఘములో సభ్యులైన శ్రీ వాజపేయ వెంకటసుబ్బయ్యగారితో నాకు స్నేహమేర్పడెను. వారు బెంగుళూరువాస్తవ్యులైనను తెలుగువారు. వాల సౌమ్యస్వభావముగల శాంతమూర్తులు, త్యాగశీలురు నగుటచే వేటపాలెములోని స్త్రీవిద్యాశాల కధ్యక్షులుగా నుండదగినవారనియెంచి, వారిని కోరగా వారు సమ్మతించి, శ్రీ గోఖ్లేగారిని కలుసుకొని, వారి అనుజ్ఞపుచ్చుకొని వచ్చెదనని పునహాకువెళ్ళి, వారివలన అనుజ్ఞాతులై, భార్యగారితో, చిన్నకుమార్తెతో గుంటూరు వచ్చిచేరిరి. వారి కొక నెల గ్రాసమునకు సరిపోవు పదార్థములు మూటలుగట్టి, పాత్రసామగ్రితోగూడ వేటపాలెము పంపుటకు సిద్ధముచేసి, వాకిటిలోనికి వచ్చునప్పటికి పోస్టు జవాను తంతివార్త యొకటి చేతి కిచ్చెను. అది విప్పి, చదువుకొనగా శ్రీ గోఖ్లేగారు పరలోకగతులై రను పిడుగువంటివార్త తెలియవచ్చెను. విభ్రాంతిచెంది, శ్రీ సుబ్బయ్యగారు కొంత తడవు నిశ్చేష్టితుడై నిలచి, దు:ఖపూరితుడయ్యెను. ఇకను వెంటనే పునహా వెళ్ళవలెనని తెలిపెను. తా నొకటి దలచిన దైవ మొకటి తలచు ననునట్లు తగినవారు దొరకిరిగదా యని సంతోషించినందుకు ఆ ఆశయు నిరాశయయ్యెను. కాని ఇంకను శారదానికేతనము స్థాపించవలెనను కోర్కె నన్ను విడువలేదు. బంగళాలను తోటను కాపాడుటకు నెలజీతములిచ్చి వృధావ్యయముచేయుట కష్టముగనే తోచుచుండెను.