పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కిచ్చివేయుపనివలెనో యున్న"దని వర్ణించెను. గుంటూరులోని కొందరుమిత్రులు అందు ముఖ్యముగ న్యాపతి హనుమంతరావు పంతులుగారు ఈప్రయత్నమును మాన్పించవలెనని బహుదూరము నాతో వాదించిరి. శ్రీ రాయసం వెంకటశివుడుపంతులుగారును నా నిశ్చయమునుండి మరల్పజూచిరిగాని తుదకు నా పూన్కియే యుక్తమని వారును తలంచిరి. తోడి న్యాయవాదులందరికి నేను చేసినపని మిక్కిలి ఆశ్చర్యముగనే యుండెను. వారిలో పలువురు నేను బాగుగ సంపాదనచేసియుంటినిగనుక మిగిలినకాలము సుఖముగ కూర్చుండి, అనుభవింతునని తలంచిరి. నేను పూర్వము చేసుకొన్న నిశ్చయమునుగూర్చి నాముఖ్యమిత్రులుతప్ప ఇతరు లెరుగరు. ఈదీక్షకు ముఖ్యప్రేరణ శ్రీ గోపాలకృష్ణ గోఖ్లేగారి జీవితవృత్తాంతమే. వారితో నెందుకు పోలనివాడ నైనను యధాశక్తి వారివలెనే వృత్తిని వదలి, దేశసేవచేయుటకు జీవితకాలములో కొంతయైనను గడుపుట యుక్తమని తలంచితిని. కొంతకాలముక్రిందట వారి భారతసేవాసంఘములో సభ్యుడుగా నుండవలెనని యోచించితినిగాని అది సిద్ధించలేదు. కాని ఆసేవకులవలెనే దేశములో చేతనైన సేవచేయుటకు అడ్డు లేదని యెంచితిని.

శ్రీ చెన్నాప్రగడ భానుమూర్తిగారు తమ ఉద్యోగమును మానజాలమని ప్రత్యుత్తరమువ్రాసినను నేనుమాత్రము నాదీక్షను కొనసాగింప నిశ్చయించుకొని యొంటరిగనే ఎదియోసేవ చేయవచ్చునని యనుకొంటిని. వేటపాలెములో విద్యాసంస్థస్థాపించుటకు శ్రీ భానుమూర్తిగారు తోడ్పడునని తలంచితిని.