పుట:Kavijeevithamulu.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి.

235



నని తెల్పెను. ఇంతలో రామకృష్ణుఁడును గృష్ణాజినదండకమండలువు లచ్చటనే వదలి వడివడి నిలు సేరి సూర్యోదయంబుననే రాజాస్థానంబునకుం బోయి

"గంగ కద్దరి మే లిద్దరి కీరునుం గలదె యుద్యద్రాజబింబాననా"

అనుసమస్య పూర్తిచేయింపుఁ డని రాజుతో విన్నవించెను. దానికి నాస్థానములోనివిద్వాంసు లందఱును రామకృష్ణునిసమస్య లతఁడే పూర్తిచేయవలెనుగాని మాచేతఁ గా దనిరి. అపుడు రామకృష్ణుఁడే దానిం బూర్తిచేయునట్లుగా నిశ్చయించి రా జాతనినే పూర్తి చేయు మనఁగాఁ బద్యముయొక్కపూర్వభాగ మందలి పాదత్రయమును జదివెను. ఆ పద్యముయొక్క రమణీయత కందఱును సంతసించి "యిది యేగ్రంథములోనిది, యేసందర్భములోనిది" అని యడిగిరి. అపుడు రామలింగ మాపద్యము "స్వర్ణయోగచింతామణిలోని వ్యాఘ్రాజిన శయ్యాసందర్భములో యోగిభోగినీసంవాదపద్య" మని పల్కెను. దానికి రా జెంతయు నాశ్చర్యంబునంది "పైకథ యింకను విస్పష్ట పఱువుఁ" డని యడిగెను. అపుడు రామకృష్ణుఁ డొకదేశములో నొక రాజు గలఁ డనియును, అతని కొక వెలయాలుండె ననియు, అది తన పాతివ్రత్యముంగూర్చి రాజును నమ్మింపఁగా నొకయోగి దానిపాతివ్రత్యమును గనిపెట్టుటకు స్వర్ణ యోగోపదేశమిషంబున దానియింటికిం బోయి పీఠము పెట్టగాఁ దద్యోగసంపాదనార్థమై యాభోగినియు యోగిని కాఁ దలంచి, వ్యాఘ్రాజినశయ్యం బవ్వళించి యుండియు నాయోగి వికృతాకారంబునకు నోడి యవ్వలిమొగమై పరుండుడు నపు డాయోగి తనభొగినిం జూచి తెల్పినపద్య మని చెప్పెను. దాని నంతయు విని రాజును నదియంతయుఁ దనసానివృత్తాంతమే యని యూహించుకొని "సెబాసు! యోగిని మెచ్చవచ్చును" అని పల్కెను. "యోగియు నంత మాత్రమునే కోరియుండెను. చిత్తము" అని రామకృష్ణుఁ డుత్తర మిచ్చి కూర్చుండెను.