పుట:Kavijeevithamulu.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

236

కవి జీవితములు

పాతివ్రత్యప్రదర్శినీ తిరస్కారము.

ఒకానొకసమయంబున నొకకవి స్త్రీలకుఁ బాతివ్రత్యవిశేషములం దెల్పు "పాతివ్రత్యప్రదర్శిని" అను నొక గ్రంథమును రచియించి తెచ్చి రాయలసభలో సమర్పించెను. ఇట్లు సమర్పించుటయే కాక తా ననేకగ్రంథములు శోధించి వానిలోనిసారము నంతయు సంగ్రహించి నిర్దుష్టముగాఁ జేసి తా నాగ్రంథము రచియించితి ననియు నది తేటతెన్గుమాటలలో నుండు ననియు నాత్మస్తుతిగాఁ కొన్నిమాటలు ప్రస్తావించెను. అట్టిప్రస్తావనకు రామకృష్ణుఁడు కొంచెము కోపించి లేచినిలువంబడి యోయీ! నీ మనస్సునకు నిశ్చయముగ దోషరహితముగాఁ గానుపించుపద్యము నొకదానిం జదువు మని యడిగెను. దానికి లెస్స యని యాకవి యీక్రిందిపద్యము చదువ నారంభించెను. ఎట్లన్నను :-

"సీ. పతికి మాఱాడక పలుమఱు నేడ్వక, యలియక మిగుల గయ్యాళి గాక."

అనుడు రామకృష్ణుం డిఁక జాలుఁ జాలును. పైచరణములు చదువ నక్కఱలేదు. గ్రంథ మంతయు నీలాగుననే యుండును. అనుడు రాయలు అట్లైన నీయభిప్రాయాను సారముగ నాచరణమున కేమియర్థము చెప్పెదువో చెప్పు మనుడు రామకృష్ణుం డిట్లనియె. అర్థమున కేమి? అందఱకును స్పష్టమైనయర్థమే. ఇది విన్నంతమాత్రమున నిఁక నే యాఁడుదియును మగనికి నాజ్ఞావర్తిని గాకుండుటయే కాక వంటగూడఁ జేసి పెట్టు మని యాజ్ఞాపించును. ఇఁక మాబోంట్లకు నాబాధకూడఁ దటస్థింపకమానదు. అయినను పద్యము వినినయంతనే నాకుం దోఁచినయర్థము విశదీకరించెదను, చిత్తగింపుఁ డని యిట్లనియె.

ఆఁడుదానికిఁ జెప్పవలసినబుద్ధులలో మొదటిది భర్త పిలిచిన యపుడు మాటాడకుండుట. రెండవది పలుమాఱు నేడ్వఁగూడ దనుట. (అనఁగా నింటిలోఁ బనిపాటులు చక్కఁగాఁజేసికొనినపిమ్మట నాల్గు సారులో యయిదుసారులో నియతముగా నిత్యమును నేడువవలసిన దనుట.) మూఁడవది ఎట్టియవసరమైనపని యున్నను శరీర మలియక యుండునంతవఱ కే పని చేయవలెను గాని ప్రాణావసరము వచ్చినను