పుట:Kavijeevithamulu.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

234

కవి జీవితములు



దానినే యప్పగించెను. ఆవారనారియును దననేర్పు బై రాగికిం దోఁపించుకోర్కెతో ననేక చమత్కారంబులు చేయుచు నాబైరాగికిఁ బరిచర్య సేయ నారంభించునది. బైరాగియును మొదటఁ దాను స్త్రీలతోఁ బ్రసంగము నైనం జేయ నని తెల్పియుఁ గ్రమక్రమంబుగ పైసుందరాంగితోఁ దల యెత్తకయే మాటలాడుచు, నది దరిఁ జేర వచ్చినప్పుడు వలదు వల దని తత్తరముతో నివారించుచు, నది దరిని వచ్చి కూర్చున్న వ్రతము వ్రత మని కేక వేయుచు నిటుల యధార్థముగ విరాగివలెనే యభినయించుచుండెను. ఇట్లుండ మఱికొన్ని దినంబులు జరిగెను. క్రమముగ నొక నాఁటికంటె నొకనాఁటికి వేశ్యకుఁ జనవు చిక్కెను గావున నది యతని కృష్ణాజినముమీఁదనే కూర్చుండుటయును, అతనికి ఫలహారమును స్వయముగ నోటి కందిచ్చుటయును, అతఁ డటునిటుఁ బోయినపు డతని జపమాలయు, గోముఖియుఁ దానే ధరియించి యాతని యాసనంబుననే నిద్రఁబోవుచున్నట్లుగాఁ బడియుంటయు జరుగుచుండెను. ఎన్ని యున్న నాతఁ డింద్రియ నిగ్రహము గలవాఁడుగాఁ గాన్పించుటంజేసి తుద కతనికి స్వర్ణ యోగమనోరథముం దెల్పి యతనిమనోరథంబు పడయుఁ డని ప్రార్థించెను. అపుడు యోగి సుముఖుండు గాఁగ నతనివిభూత్యుద్ధూళ నావృతవికృతాకారముం జూచి కన్నులు మూసికొని రెండవప్రక్కకుం దిరిగి పండియుండె. అపుడు కపటయోగి యగురామకృష్ణుం డాభోగినీపతివ్రతకు స్వస్వరూపప్రకటనముం జేయుట కదియ తఱి యని నిశ్చయించి యిట్లనియె :-

"మ. వరబింబాధరమున్ పయోరుహములున్ వక్రాలకంబుల్ మనో
       హరలోలాక్షులు చూప కవ్వలిమొగం బైనంత నేమాయె? నీ
       గురుభాస్వజ్జఘనంబు క్రొమ్ముడియు మాకుం జాలవే గంగ క
       ద్దరి మే లిద్దరి కీడునుం గలదె యుద్యద్రాజబింబాననా."

అని యిట్లు చదివినపద్యంబు విని యాజవరా లతఁడు రామకృష్ణుఁడు గా నిశ్చయించి మోసమాయెఁ గదా యని యెంచి కుప్పించి యొక్కదాఁటున నింటిలోఁ బడి తల్లిం బిల్చి రామకృష్ణుఁడు భంగపఱిచె