పుట:Kasiyatracharitr020670mbp.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుడిశయున్నులేదు. అన్ని వస్తువులు జననాపురమునించి తెచ్చుకొనవలెను. నిప్పు దొరకటమున్ను ప్రయాస. అచ్చట రాత్రిపూట మనుష్యులు నిలవరు. ఆ గుడిలో లింగమునకు దిగువగుండా తీర్థము స్రవించి ఒక తొట్టెలో నిలిచి అవతల ప్రవహింపుచున్నది. గుడి తీర్థము రమణీయ్య మైనది. శాస్త్రసిద్దమైన స్థలము. అర్చకుడు తంబళమువాడు. వచ్చినావారు తామే యీశ్వరుని అభిషేకము చేసి పూజింపు చున్నారు. అర్చకుడు ప్రతిదినమున్ను ఉదయమయిన జాముకు వచ్చి గర్భగృహము తలుపు తెరుచుచున్నాడు. గోసాయీలున్ను బయిరాగులున్ను 2, 3 దినములు ఆ స్థలమందు నిలిచి పునశ్చరణ చేయుచున్నారు. అక్కడ 2 ఘంటల దనుక నుండి రాత్రి ఆమడదూరములో నున్న బండాతుకూరు సాయంకాలమునకు చేరినాను. దోవ రేగడభూమి. ముండ్లు విస్తరించి యున్నవి. దోవలో నొక చిన్న నదిన్ని, మరికొన్ని కాలువలున్ను దాటవలెను; అడివి లేదు. ఆ యూరు కందనూరు వారిది. బస్తీ గ్రామము. అన్ని వస్తువులు దొరుకును. ఇండ్లు గొప్పవి. ఆప్రాంతములలో ఆవులకు పాలు పితుకుట లేదు. దూడలను ఆవులతో కూడా మేతకు తోలుచునున్నారు. అక్కడివారికి యెనప పాడి సహజముగా నున్నది. పశువులకు తాము కాపురముండే యిండ్ల కంటే చక్కగా కొఠములు కట్టి బాగా కాపాడుచున్నారు. ఆ ప్రాంతములలో వరిపంట లేదు. పుంజధాన్యములు సమృద్ధిగా పండుచున్నవి. శూద్రులు బాగా కష్టపడి కృషిచేయుచున్నారు. బ్రాంహ్మణులకు భూజీవనము పుష్కలముగా కలిగియున్నది.

21 తేది రాత్రి 4 ఘంటలకు ఆమడలోనున్న వెలపనూరు చేరినాను. దోవ రేగడ, సరాళము, అడివినిండాలేదు. ఇండ్లు గొప్పవి. బట్టల అంగళ్ళు గూడా యున్నవి. సకల పదార్థములును దొరుకును. మంచి బ్ర్రాంహ్మణులున్నారు. గ్రామకరణ మయిన శేషప్ప అనేఅతడు అన్నదానము జేయిచున్నాడు. ధర్మ్మాత్ముడు. నవాబు తరపున ఉద్యోగస్థులు కొందరు ఆ గ్రామములో నున్నారు. ఉదకసౌఖ్యమునిండాలేదు. అక్కడికి ఓంకార మనే స్థలము 8 పరుగుల దూరములో