పుట:Kasiyatracharitr020670mbp.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనుగుల వీరస్వామయ్యగారి

వెనుక కూడా తానుగా కర్మలను విడవకుండా జ్ఞానప్రకాశముచేత అక్రమములు తన్ను వదిలిపోయ్యేటట్టు నటింపవలసినదని దోచబడు చున్నది.

ఈ రీమారాజు పారంపర్యముగా యీ రాజ్యమును యేలుచున్నాడు. ఇతడు బగ్గెలు అనే క్షత్రియజాతి. యీరాజు పేరు జయశింగదేవు. ఇతనికి ముగ్గురు కుమాళ్ళు, వారు విశ్వనాధశింగు, లక్షమణసింగు, బలభద్రశింగు అనే పేళ్ళుగలవారు. యీముగ్గురుకిన్ని రాజ్యము పంచిపెట్టి జ్యేష్టుణ్ణి తనకు బదులుగా పట్టాభిషేకము చేసి వుంచి యిప్పటికిన్ని తండ్రి సుఖముగా వున్నాడు. సంవత్సరము 1 కి పదిలక్షల రూపాయల యెత్తే రాజ్యము వీరికి కలిగియున్నది. యీ రాజు కుంఫిణీ వారిని నిండా లక్ష్యపెట్టడములేదు. యధోచితమయిన స్వతంత్రదశనుపొంది నటింపుచున్నాడు. కొన్ని కాలాలలొ దేవబ్రాంహ్మణపూజ బాగా చేస్తాడు. ఈ వూరిలో ఈ రాత్రి డేరాలలొ వశించినాను.

23 తేది ఉదయాన 4 ఘంటలకు లేచి యిక్కడికి 8 కొసుల దూరములోవుండే రాయపూవు అనే వూరు 9 ఘంటలకు చేరినాను. దారి సడక్కు వేసినారనే పేరేగాని వేయనట్టే వున్నది. వుమరియనే వూరి పర్యంతము జబ్బల్ పూరు దారి విచారణకర్త అయిన కేపన్ నిక్కిల్సిన్ విచారణ అయినందున దారి యొక తీరుగా కాపాడపడి వున్నది. వుమరికి యివతల మిరిజాపూరు దారి విచారణకర్త కేపన్ ద్రమ్మన్ విచారణగనుక దారి విచారణ బహు తక్కువగావుండేటట్టు అగుపడుచున్నది. భాటకు యిరుపక్కలా చెట్లుకూడా పెట్టినట్టు అగుపడలేదు. భూమి యెర్రరేగడ గనుక యెండివుండేచోట గుచ్చుకొనుచున్నది. మైహరు మొదలుగా భూమి బాగా పచ్చికబట్టి వుండలేదు. పయిరున్ను వృద్ధికాకుండా వుండేటట్టు తోస్తున్నది. యీ రాయపూరు అనేవూరు గొప్పదేను. వూరిలో ఎక్కడ చూచినా మిట్టపల్లము, అడుసు కాలువలు మొదలయిన అపహ్యాములతో నిబిడీకృతముగా వున్నది. వూరిచుట్టూ నాలుగు తొటలు, పెద్దగుంటలు, చెరువులున్ను వున్నవి. సకలపదార్ధాలున్ను ముసాఫరులకు దొరుకును. అంగళ్ళు శానావున్నా వసతికావు గనుక దేరాలలో యీ దినమంతా వసించినాను.