పుట:Kashi-Majili-Kathalu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి కథ

83

కాదంబరి సంభ్రమముతో నతనికి నమస్కరించి మహాశ్వేతతోఁగూడఁ బర్యంకమునఁ గూర్చుండెను. పిమ్మటఁ బరిజనులచేఁ దొందరగాఁ బర్యంకశిరోభాగ ప్రాంతమున వేయ బడిన హేమపాదాంకితమగు రత్నపీఠంబునఁ జంద్రాపీడుఁడు పవిష్టుం డయ్యెను.

అప్పుడు ప్రతిహారులు కాదంబరీ మహాశ్వేతల సంవాదప్రకారము విను తలంపుతో సంవృతముఖ వ్యస్తహస్తలై హస్తసంజ్ఞలచే వేణువీణాది గీతధ్వనులు వంధిమాగధ జయశబ్దముల నంతటను నాపివేసిరి.

అంతలో గాదంబరిలేచి పరిజనోపనీతమగు నుదకముచే మహాశ్వేతపాదములు గడిగి యుత్తరీయాంశుకమునఁ దడియెత్తి వెండియుఁ దల్పంబునఁ గూర్చుండెను.

పిమ్మటఁ గాదంబరికిఁ బ్రాణసఖురాలు. అనురూపరూపలేఖ, మదలేఖ యనునది రాజపుత్రుం డిచ్చగింపకున్నను బలవంతమున నతని పాదంబులం గడిగి తడియొత్తినది.

అప్పుడు మహాశ్వేత కర్ణాభరణ మణికిరణ కిమ్మారిత మగు కాదంబరియొక్క భుజముపైఁ జేయివైచి చోమరపవనంబునఁ జారుచున్న కుసుమంబు వెండియు వేణికాబంధంబునం గూర్చుచు సఖీ! కాదంబరీ! కుశలముగా నుంటివా? అని యడిగిన గాదంబరియు నిజగృహనివాసంబున నపరాధము జేసినదివోలె సిగ్గుపడుచు నిట్లుత్తరము చెప్పినది.

చ|| ప్రియసఖి నార చీరల ధరించి భయంకర భూరికందరా
     లయమునుండి యాకలములన్ భుజియింపుచు దారుణ వ్రత
     క్రియలను గాలము న్గడుప హ్రీరహితాత్మకనైన నాకనా
     మయమున కేమిలోటిట సమస్తభోగములన్ భజింపఁగన్||

వ|| అని పలికి,