పుట:Kashi-Majili-Kathalu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

కాదంబరి


వాఁడు. విజయయాత్రాప్రసంగమున నీభూమి కరుదెంచెను. చూచినదిమొదలు నాకితండు నిష్కారణబంధుఁడై యొప్పెను. పరిత్యక్త సకలసంగనిష్టురమైనను నాచిత్తవృత్తి స్వభావసరళము లగు సుగుణములచే నితం డాకషి౯ంచెను. దాక్షిణ్య పరవశుండు నకృత్రిమ హృదయుండు విదగ్ధుండనగు నిని౯ మిత్త మిత్రుండు దొరకుట దుర్ఘటము గదా?

నేనువోలె నీవుగూడ నీసుకుమారునించూచి వాణీధవుని నిర్మాణకౌశలము పృధివికిఁ గల వాల్లభ్యసౌఖ్యము మర్త్యలోకము సురలోకమును మించుటయు మనుజస్త్రీలయొక్క నేత్రసాఫల్యము సర్వకళలు నొక్కచోటనుండు విధముం దెలిసికొనఁగలవని బలవంతముగా నీతని నిచ్చటికిఁ దీసికొని వచ్చితిని. నిన్ను గుఱించి యీతనితోఁ జాల చెప్పియున్నదానఁ గావున నితండు క్రొత్తవాఁడని సిగ్గు పడక అవిజ్ఞాతశీలుఁడని శంకింపక నాయందెట్టి ప్రీతిగలిగి యుంటివో వీని యందుఁగూడనట్లే వర్తింపవలయును.

ఈతఁడే మనకుఁ బరమమిత్రుఁడు. ఈతఁడే మనకు దగ్గిర చుట్టము. ఈతఁడే మనకు నమ్మఁదగిన పరిజనుఁడు అని చెప్పినది. అప్పుడు చంద్రాపీడుఁడు. కాదంబరికి నమస్కారము గావించెను.

అట్లు నమస్కరించిన చంద్రాపీడు నత్యంత ప్రీతిపూర్వకముగా వార చూపులచేఁ జూచుచున్న కాదంబరియొక్క నేత్రకోణములనుండిఁ శ్రమజలకణములవలె నానందబాష్పబిందువులు రాలినవి. మొగంబున సుధాధవళము లగు స్మితజ్యోత్స్న లించుక వ్యాపించినవి ప్రతి ప్రణామంబున నతని సత్కరింపు మని శిరంబున కెఱింగించునవివోలె భ్రూలతలు పై కెగసినవి.

అప్పు డందున్న గంధర్వకన్యకలు తిర్యగ్విలోకనముల నతని సోయగము బరికింపం దొడంగిరి.