పుట:Kashi-Majili-Kathalu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

కాదంబరి


వీచుచుంటి. మిక్కుటమగు తాపముచే నాచేయు శైత్యోపచారములన్నియుఁ నిష్ఫలములగుచుండం జూచి నేనిట్లు తలంచితిని. అన్నన్నా! మన్మధునికి సాధ్యముకానిది లేదుకదా! హరిణమువలెఁ గ్రుమ్మరుచు స్వభావముగ్ధు డగునీతండేడ? వివిధవిలాస రసరాశియగు గంధర్వ రాజపుత్రియేడ? యెట్లు సంఘటించునో చూడుము. సాగర గంభీరుఁడగు నితని దృణమువలెఁ దేలికపరచెనే? యింతకన్న ప్రౌఢిమ యేమిగలదు. అన్నిగతులచేతఁ దీర్పరాని యాపద తటస్థించినది. ఏమి చేయుదును? ఎక్కడఁజొత్తును? ఎవ్వరితోఁ జెప్పుదును? యెట్లు వీని ప్రాణములు నిలుచును? ఉపాయమెద్ది? కర్తవ్యమేమి? యని యనేక ప్రకారములఁ దలంచుచు అయ్యో యీ వెఱ్ఱియాలోచనలతోఁ బని యేమి? తత్కాంతాసమాగముకన్న వేరొండుసాధనమున వీఁడు బ్రతుకఁడు అట్టిపనియే చేయందగినది. తాపసజనులకిది యనుచితమని నేనిప్పు డూరకుంటినేని యేకోచ్ఛ్వాసజీవితుం డగు నితండు కాలమును సహింపక మృతినొందఁగలఁడు. గర్హితకృత్యముచేతనయినను మిత్రాసువుల రక్షింపఁదగినదికదా! కావున నేనిప్పు డన్నిగతుల చేత నానాతియొద్దకుఁ బోవుటయే యుచితముగా నున్నయది. ఇతని యవస్థ యంతయు నాయింతి కెఱింగించెద నని నిశ్చయించుకొనుచు నెన్నఁడును దుర్వృత్తియందుఁ బ్రవేశింపని యతండు నన్నుఁ జూచి సిగ్గుతో నావృత్తి మరలించుకొనునేమో యని యెద్దియో మిషబన్ని యతనితోఁ జెప్పక యచ్చోటు బాసి నీయొద్దకు వచ్చితిని. తరువాత చేయందగిన కృత్యమెద్దియో యాలోచింపు మని పలికి నా మొగంబునఁ జూట్కి నిలుపుచు నామాట విను తాత్పర్యముతో నూరకొనియెను.

అతని మాటలు విని నేను సుఖామృతమయమగు హ్రదంబున మునిఁగినదానివలె సంతసించుచున్నప్పుడు బొడమిన సిగ్గుచేతఁ దల వాల్చుకొని కన్నుల నానందబాష్పములు గ్రమ్మ మనమ్మున నిట్లు