పుట:Kashi-Majili-Kathalu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుండరీకుని కథ

61

విషయతత్వముల నెఱింగియు స్ఖలితమయిన జ్ఞానముద్ధరింపవేమి? ఇంద్రియముల నివారింపవేల? చిత్తమును నియమింపవేమి? ఈమన్మధుఁ డన నెంతవాఁడు ధైర్యమవలంబించి వానిని పరిభవింపుము అని నేను బలుకుచుండగనే నామాటల నాక్షేపించుచుఁ గన్నీరుదుడుచుకొనుచు నా చేయిపట్టుకొని యతం డిట్లనియె.

కపింజలా! పెక్కుమాటలతోఁ బ్రయోజనమేమి? ఆశీవిష వేగముగల విరితూపుల పోటుపడనివాఁడెన్నేని బరుల కుపదేశింప వచ్చును. ఇంద్రియములు మనంబును నెవ్వనికిఁ గలిగియుండునో శుభాశుభవివేచన మెవ్వఁడెఱిఁగి యుండునో వాఁడుపదేశమునకుఁ దగినవాఁడు. నాకవి యన్నియు దవ్వైనవి. యుపదేశకాల మతిక్రమించినది. జ్ఞానము నిలుపుకొనుసమయము మించిపోయినది. నీకంటె నాకు సన్మార్గముపదేశించువాఁడు లేడు. నీయుపదేశము నేను వినఁదగినదే కాని నామానసవికారము మరలించుకొనుటకు శక్యము కాకున్నది. నేనేమిచేయుదును? మదనసంతాపముచే నా యంగము లన్నియు నుడికిపోవుచున్నవి. దీని కెద్దియేని ప్రతిక్రియ యెఱుంగుదువేని యాచరించి నీ ప్రియమిత్రునిఁ బ్రతికించుకొమ్మని పలికి యూరకుండెను.

అప్పుడు నేను మరల నతని మతిమరలింపఁదలంచి శాస్త్రదృష్టాంతములు నితిహాస నిదర్శనములు నగు మాటలచే నెం తేని నీతి నుపదేశించితిని. కాని యతం డేమియుఁ జెవియొగ్గి వినకపోయెను.

ఇఁక నుపదేశములతోఁ బ్రయోజనము లేదని నిశ్చయించి నేను లేచి యత్తటాకములోనికిఁబోయి తామరతూడులను, కమలినీ దళములను, గలువలను, పద్మములనుం గోసికొనివచ్చి యందున్న లతామంటపమునందలి శిలాతలంబునం బాన్పుగా బరచి యతనినందు బరుండఁబెట్టి చందనతరుపల్లవంబులం దెచ్చి రసముతీసి స్వభావసురభియగు నారస మాపాదమస్తకముగా నతనిమేనం బూసి కదళీదళంబున