పుట:Kashi-Majili-Kathalu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

కాదంబరి

అప్పుడు దూరమునం దతనింజూచి కాదంబరి చంద్రాపీడుని వక్షమునుండిలేచి యతివేగముగాఁ బరుగిడి మహాశ్వేతను గౌఁగలించుకొని తదాగమన వృత్తాంతమును జెప్పెను.

అంతలోఁ బుండరీకుఁడును జంద్రాపీడుని చెంతకువచ్చి యాలింగనము చేసికొనియెను.

చంద్రాపీడుఁ డతని బిగియఁగౌఁగలించుకొనుచు వయస్యా! పుండరీక! ప్రాగ్జన్మసంబంధంబున నీవు నాకల్లుఁడ వైతివి. ఎట్లయినను మనము తదనంతర జన్మసంబంధ సముపగతమైన మైత్రిచేతనే వర్తింపఁ దగినదని పలుకుచున్న సమయంబునఁ గేయూరకు డావార్త జిత్రరధహంసుల కెఱింగింప హేమకూటమునకుఁ బోయెను.

మదలేఖయు వేగముగాఁబోయి యాప్రాంతమునఁ దాపస వృత్తితో మృత్యుంజయ జపముచేయుచున్న తారాపీడుని పాదంబులంబడి చంద్రాపీడుఁడు జీవించిన వృత్తాంతమును జెప్పెను.

ఆమాటవిని తారాపీడుఁడు విలాసవతితోఁగూడ నానందసాగర మగ్నుండై యత్యాతురముగాలేచి శుకనాసుఁడు తోడరాఁ మదలేఖ వెంటఁ జంద్రాపీడుఁ డున్న చోటికిఁబోయి యందుఁ బుండరీకునిమెడఁ గౌగలించుకొనియున్న కుమారునింజూచి నానందబాష్పములు నేత్రంబులగ్రమ్మ నపారసంతోషపారావారంబున మునుంగుచుఁ బుత్రుం గౌఁగిలించుకొనియెను.

తల్లియుఁ బాలిండ్లు స్రవింపఁ దనయుంజూచి సంతోషవివశయై యుండె. అప్పుడు చంద్రాపీడుఁడు దల్లిదండ్రులకు నమస్కరించుచు శుకనాసునికిసైతము గేలుమోడ్చి యతని యాశీర్వాదమందుకొనుచు ఆర్యా! వీఁడే వైశంపాయనుఁడు చూడుమని పుండరీకునిం జూపెను.

ఆప్రస్తానములోనే కపింజలుఁడు సమీపించి శుకనాసుని కిట్లనియె.