పుట:Kashi-Majili-Kathalu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కపింజలునికథ

165

ఆర్య! శ్వేతకేతుండు మీకిట్లు చెప్పుమనియె.

ఈపుండరీకుఁడు నాచేతఁ బెంపఁబడుటయేగాని నీకే పుత్రుండు వీనికిని నీయందే ప్రేమగలిగియున్నది. కావున వీని వైశంపాయనుఁడే యనుకొని యవినయకార్యములఁ బ్రవర్తింపనీయకుము. వరుఁడని యుపేక్షింపకుము వీఁడు నీవాఁడే యనియే శాపావసానమున సైతము నీయొద్దకే పంపితిని.

అదియునుంగాక మదీయంబగు సాత్వికతేజం బిప్పు డింతకన్న నుత్తమలోకంబునకుం బోవనున్నది.

అని యిట్లు శ్వేతకేతుని సందేశము కపింజలుండు చెప్పగా విని శుకనాసుఁడు వినయావనమ్రుఁడైయున్న పుండరీకు నంసంబు బట్టుకొని కపింజలున కిట్లనియె.

కపింజల! సర్వజ్ఞుండైన శ్వేతకేతుం డిట్టివార్త బంపనేమిటికి? నేస్తంబున నిట్టిమాట వినినచో సంతోషము గలుగునా? అందరకు నమ్మహానుభావుని యాశ్రయమే కావలయునని యిట్లు పూర్వజన్మ సంస్మరణానురూపములైన యాలాపములుచేత నాదివసము గడిపెను.

అమ్మరునాఁ డుదయంబున గంధర్వకులనాయకులగు చిత్రరధహంసులు సపత్నీకులులై పెక్కండ్రు పరిచారకులుసేవింప నచ్చోటికి వచ్చి యల్లుండ్రం గూఁతుండ్రం జూచి యెం తేని సంతసము జెందుచుఁ దారాపీడ శుకనాసులచే మన్ననల వడసి తాత్కాలోచిత సంభాషణములచేఁ గొంత కాలక్షేపము చేసిరి.

అప్పుడు చిత్రరధుండు తారాపీడునింజూచి యార్యా! మిగుల వైభవముగల భవనములు గలిగియుండ నీ యరణ్యములో వర్తింపనేల? హేమకూటమునకుఁ బోవుదము రండని పలుకగా విని తారాపీడుం డిట్లనియె.