పుట:Kashi-Majili-Kathalu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కపింజలునికథ

163

అంత నక్కడఁ గాదంబరియు నొక వసంతకాలంబునఁ గామోత్సవంబు గావించి వాడుకప్రకారము ప్రాతఃకాలంబునఁ జంద్రాపీడుని దేహము నర్చించి యుత్సుకముతోఁ గంఠము గౌఁగలించుకొనినది.

అప్పు డమృత సేకంబునంబోలె నయ్యాలింగనసుఖంబునఁ జంద్రాపీడుఁడు మేనంబ్రాణములు జేరుటయు నాతపసంతాపంబున ముకుళించిన కలువశరత్కాలకౌముదిచే వికసించినట్లు మెల్లన హృదయ ముచ్ఛ్వాసభాసురంబయ్యె. ప్రాతఃపరామృష్టేందీవర ముకుళము మాట్కి కణా౯ంతాయతమగు నయనయుగము విడినది. మోము పద్మవికాస వహించినది.

అట్లు నిద్రమేల్కాంచినట్లులేచి చంద్రాపీడుఁడు మెడఁ గౌఁగలించియున్న కాదంబరిని జిరవిరహ దుల్లభములగు లోచనములచే గ్రోలువాడుంబలెఁ జూచుచు గంఠంబు గౌఁగలించుకొని వాతాహత బాలకదళియుంబోలె వణంకుచుఁ గన్నులుమూసికొని తొట్రుపడుచున్న యాచిన్నదానికి మనోహరస్వరముచే నానందము గలుగఁజేయుచు నిట్లనియె.

బోఁటీ! నీవు వెరవకుము నీకరస్పర్శంబుదగిలి నేను జీవించితిని. అమృతసంభవంబగు నప్సరఃకులంబున నీవు జనియించితివికదా. శాపదోషంబున నిన్నిదినములు మనకు వియోగంబు గలిగె. ఇప్పుడు త్వద్విరహదుఃఖప్రదమైన శూద్రకనృపశరీరమును విడిచితిని. ఇఁక నీకు సుఖముగలుగు నీప్రియసఖి మహాశ్వేతయొక్క ప్రియుండుసైతము నాతోఁగూడ శాపవిముక్తివడసె నప్పఁడతియు సుఖించునని పలుకుచున్న సమయమునందే నాగలోకమునుండి కపింజలునికై దండఁగొని పూర్వము మహాశ్వేతచూచిన రూప మాకంఠమాల యాయక్షసూత్ర మాశాటీపటముతోఁ బుండరీకుఁ డచ్చోటికి వచ్చెను.