పుట:Kashi-Majili-Kathalu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

కాదంబరి


వత్తింపుచుంటివి. ఈమూఢజనమార్గమును విడువుము. కూర్చుండి చెప్పుము. మాతండ్రి కుశలుఁడై యున్నవాఁడా? నన్నెన్నఁడైన స్మరించునా? ఈవృత్తాంతమునువిని యేమనుచున్నవాఁడు. కోపము సేయుచుండెనా? ఏమి? అని నేనడిగిన నతండు హరీతశిష్యునిచే వేయబడిన పల్లవాసమునఁ గూర్చుండి నన్నుఁ దొడయం దిడికొని హరీతకునిచే నీయఁబడిన యుదకముచే మొగము గడిగికొని నా కిట్లనియె.

మిత్రుఁడా! మీతండ్రి కుశలుఁడై యున్నవాఁడు మనవృత్తాంత మంతయు దివ్యదృష్టిచేఁజూచి ప్రతిక్రియకొఱకుఁ బ్రయత్నించుచుండెను. అంతలో నేను తురగత్వమునువిడిచి ఆయనయొద్దకుఁ బోయితిని. దూరమునందె నన్నుఁ జూచి కన్నుల నశ్రుజలంబుగ్రమ్మ భయపడుచున్న నన్నుఁ జేరదీసి గారవింపుచు నిట్లనియె.

వత్స! కపింజల వగవకుము. ఈతప్పు నాదికాని మీదికాదు. పుండరీకుఁడు పుట్టినప్పుడే వాని కిట్టి దోష మున్నదని యెఱింగియుఁ బ్రమాదంబున నాయుష్కరమగు కర్మ నిర్వత్తించితినికాను. ఇప్పు డన్నియుం దీర్చితిని కొలఁదిదినములలో నీకష్టము లన్నియుం బోవఁ గలవు. అంత దనుక నీవు నాయొద్ద నుండుమని యాజ్ఞాపించుటయు నే నిట్లంటి.

తాతా! నీకు నాయం దనుగ్రహము గలిగినచో నామిత్రుఁ డెందుండెనో యచ్చటికిఁ బోవుట కాజ్ఞ యిమ్ము. వానిం జూడ నాకు మిగుల నాతురముగా నున్నదని యడిగిన నమ్మహర్షి యిట్లనియె. వత్స! వాఁ డిప్పుడు చిలుకగా నుదయించి యున్నవాఁడు. నీవు వోయియు వానిం దెలిసికొనఁజాలవు. వాఁడును నిన్నెఱుగఁడు కొంతకాల మరుగనిమ్మని యాజ్ఞాపించెను. నేనందే యుంటిని. నేఁటి