పుట:Kashi-Majili-Kathalu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20]

కపింజలునికథ

153


యుదయంబున నన్నుఁజీరి యా పారికాంక్షీ వత్సా! కపింజల! నీ మిత్రుఁడిప్పుడు మహానుభావుండైన జాబాలి యను మహర్షి యాశ్రమములో నున్నవాఁడు. వానికిప్పుడు తత్ప్రసాదంబునఁ బూర్వజన్మ స్మృతిగలిగినది. కావున నీవిప్పు డతనిం జూడఁబొమ్ము. కర్మ పరిపక్వమగువఱకు నా మహాత్ముని యాశ్రమము విడువవలదని నా మాటగాఁ జెప్పుము. అని యుపదేశించెను. మఱియు నీ తల్లియగు లక్ష్మియు నీ దుఃఖము విని దుఃఖించుచు నీ విముక్తి కొఱకై యమ్మునికిఁ బరిచర్య చేయుచున్నది. ఆమెయు నీకిట్లే చెప్పుమన్నది. అని పలుకుచు శిరీష కుసుమపేశల పక్ష్మమములగు నా గాత్రములఁ దన మృదుకరతలంబున దువ్వుచు హృదయంబున మిక్కిలి పరితపించెను.

అప్పుడు నే నతనింజూచి వయస్యా! నీవెందులకు విచారించెదవు? మందభాగ్యుండ నగు నా మూలమున నీవు తురగమై పుట్టి యనేక కష్టము లనుభవించితివి. అయ్యయ్యో! సోమపానోచితమగు నీ నోటి యందు నురగతోఁగూడిన రక్తము స్రవింపుచుండఁ దగిలించిన యినుప కళ్ళెముయొక్క క్షతము లెట్లుగా సహించితివి?

కిసలయశయనోచిత సుకుమారగాత్రుండవగు నీవు పండుకొనక సంతసము నిలఁబడి యెట్లుగానుంటివి? మిక్కిలి కోమలములగు నీ యంగములఁ గశాఘాతము లెట్లుగా భరించితివి? అక్కటా! బ్రహ్మ సూత్రభారమును వహించెడు నీ దేహమున బిడుగుపడినంత బాధగల నీడల నెట్లుగా సహించితివి బాబూ! అని పలుకుచు వానితోఁ బూర్వ వృత్తాంతముల ముచ్చటింపుచుండ క్షణకాలము తిర్యగ్జాతిదుఃఖము మరచి యానందించితిని.

అంతలో మధ్యాహ్న సమయమగుటయు హరీతకునితోఁగూడ గపింజలుఁడు యధోచితాహారమున నన్నుఁ దృప్తుం గావించి తాను గూడ భుజించి క్షణకాల మూరకొని వెండియు నాకిట్లనియె.