పుట:Kashi-Majili-Kathalu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కపింజలునికథ

149


శరీర మొక్కండుదక్క తక్కిన చర్యలన్నియు మనుష్యుండువలెనే చేయ సామర్ధ్యము గలిగినది. అట్టుజ్ఞానముగలిగి నిజవినయ శ్రవణంబునఁ గలిగిన సిగ్గుచేత నించుక తలవంచుకొని కొంచెముసే పూరకొని నే నల్లన నా జాబాలి కిట్లంటి.

దేవా! నీయనుగ్రహంబున మదీయ పూర్వవృత్తాంతమంతయు స్మరణకు వచ్చినది. యాప్తులనందరను స్మరించుకొంటిని. నామృతిని వినినంత హృదయము భేదిల్లఁ జైతన్యమును విడిచిన చంద్రాపీడుఁడు జన్మాంతరమున నే శరీరమును దాల్చెను? దయయుంచి వక్కాణింపుఁడు. అతనితోఁ గలసికొంటినేని తిర్యగ్యోనియందున్నను నాకు సంతసముగానే యుండునని యడిగిన నమ్మహర్షి పుంగవుండు కన్నుగవఁగెంపుగదుర నన్నుఁ జూచుచు, దురాత్మా! నీచిత్తచాంచల్య మింకను విడువకున్నవాడవే దానిమూలముననేకదా! ఇట్టియవస్థ ననుభవింపుచున్నవాఁడవు. ఇప్పుడు నీకు రెక్కలైనను బూర్తిగా రాలేదే తొందరపడియెదవేల? ఎగురుటకు సామార్ధ్యము వచ్చినప్పుడు నన్నీ సంగతి నడుగుము చెప్పెదనని పలికిన విని హారీతకుం డిట్లనియె.

తాతా! ఈతండు మునిజాతియందు జనియించియు జీవితమును విడుచునంత కంతుసంతాపమును జెందెనేమి? దివ్యలోకసంభూతున కల్పాయువు గలుగుటెట్లు నాకు మిక్కిలి విస్మయముగా నున్నది. ఎఱింగింపవేయని యడిగిన నమ్మునిమార్తాండుండు వెండియు నిట్లనియె.

వత్సా! యీతండు కామరాగమోహమయము నల్పసారము నైన స్త్రీవీర్యమువలనఁ బుట్టుటచేనట్లయ్యె. అల్పసారమగు స్త్రీవీర్యంబునం బొడమిన జంతువు గర్భంబుననే హరించును. లేక చచ్చియెనం బుట్టును. జీవించి పుట్టినను దీర్ఘకాలము బ్రతుకదని యాయుర్వేదంబున స్పష్టముగాఁ జెప్పఁబడియుండ దీనికి విస్మయమేల దద్దోషంబున