పుట:Kashi-Majili-Kathalu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

150

కాదంబరి


జేసి వీఁడు కామరతుండై మదనజ్వరవేగంబున సమసె. శాపావసాన కాలంబున దీర్ఘాయుష్మంతుఁడై యొప్పునని చెప్పెను.

అప్పుడు నేను వెండియు మహాత్మా! నేను బాపాత్ముఁడైనై యీతిర్యగ్యోనియందు జనియించితిని. నీయనుగ్రహంబున నాకు వాక్కుమాత్రము వచ్చినది. యభూతపూర్వమైన జ్ఞానమునుగలిగినది. నా కే సుకృతంబున నీరూపము వాయగలదు. ఆయు వెట్లు వర్థిల్లు నాచేయవలసిన కృత్యమెద్ది? దయామయుఁడవై యెఱింగింపుమని ప్రార్థించిన విని యజ్జాబాలి దిఙ్ముఖంబులు సూచుచు, అయ్యో! ఈ కథామూలంబునఁ దెల్లవారిపోయినది యనుష్ఠానువేళ యతిక్రమించినది. యది యట్లుండనిమ్మని పలుకుచు నాగోష్ఠి చాలించి లేచుటయు నమ్మునులందరు తత్కధారసాస్వాదంబునఁ జేయదగిన కృత్యములు మరచి విస్మయమందుచు నెంతకష్టమని పలుకుచు నొక్కింతసేపుండి పిమ్మట దమతమ నివాసములకుఁ బోయిరి. హరీతకుండును నన్ను మెల్లగా జేతియం దెక్కించుకొని వర్ణశాలయం దొకవేదికయందు భద్రముగా నునిచి తాను స్నానార్ధ మఱిగెను.

పిమ్మట శేనాత్మగతంబున అయ్యో! అనేక భవసుకృతపరిపాకంబునంగాని మానుషదేహంబు గలుగదు. దానియందు సకలజాతి విశిష్టమైన బ్రాహ్మణ్యము దుర్ఘటమైనది. అంతకన్న నా సన్నామతృ పదముగల మునిత్వము విశిష్టతరమైనది. దివ్యలోక నివాసిత్వ మంతకన్న విశేషమైనది. అట్టి యున్నతపదమునుండి స్వదోషమూలముననే యధోగతింబడి యిట్టి తిర్వగ్జాతియందుఁ బుట్టితిని. అన్నన్నా! ఎంత మోసము వచ్చినది. సీ! ఇఁక నాకీ జీవితముతోఁ బ్రయోజనమేమి? ఈశరీర మెట్లయినను సరియే విడిచి విధిమనోరధమును సఫలము జేసెదనని యూహించి జీవితమును విడుచుటకు నిశ్చయించుకొని యుంటిని.