పుట:Kashi-Majili-Kathalu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

148

కాదంబరి


యది. లేనిచో మృతుండైనవాఁ డిట్లుండుట యెందేనిజూచియుంటిమా ఇది శాపదోషముకాక మఱియొండు కాదని పలికి యక్కలికి నూరడించెను. కాదంబరియుఁ బ్రతిదినము చంద్రాపీడమూర్తిని దేవతా విగ్రహమునట్లు త్రికాలములయందుఁ బూజింపుచు ధృతవ్రతయై శాపావసానకాల మరయుచుండెను.

మఱికొన్ని దినంబులకుఁ దారాపీడుఁడు చారముఖంబుగాఁ దద్వృత్తాంతమంతయును విని మిక్కిలి పరితపించుచు మనోరమా శుకనాసులను గమింప విలాసవతింగూడి యుచిత పరివారములతో నయ్యాశ్రమమునకుఁబోయి యందు జంద్రాపీడుని యవస్థంజూచి పెద్దయుం బ్రొద్దు జింతించి శాపప్రకారమంతయు వినియున్నవాఁడు కావున నెట్టకే శుకనాసునిచే బోధింపఁబడి వైరాగ్యమునువహించి రాజ్యభారము మంత్రులయం దుంచి భార్యతోగూడ నాప్రాంతమందున్న వనములో మునివృత్తిబూని కాలక్షేపము చేయుచుండెను.

అనిచెప్పి జాబాలి పక్కుననవ్వి హారీతప్రముఖులగు మునులతో ననఘులారా! యాకధారసం బెంత వింతగా నున్నదియో వింటిరా? వక్తవ్యాంశమునువిడిచి యతిదూరము చెప్పుకొని పోయితిని.

వినుం డాపుండరీకుండు కామోపహతచిత్తుండై తానుజేసిన యవినయదోషంబున దివ్యలోకమునకుఁ జెడి పుడమియందు శుకనాస తనయుండైన వైశంపాయనుఁడుగా జనియించెను.

వెండియు నతండు మహాశ్వేతచే శపియింపంబడి యిట్లు చిలుక యోనియందు జనియించెనని యెఱింగించినంత నాకప్పుడు నిద్రమేల్కాంచినట్లుగా యితిస్మరణగలిగి బూర్వజన్మోపాత్తవిద్య లన్నియును స్ఫురించినవి. మనుజుండువోలె స్పష్టముగా మాట్లాడుటయు సర్వవస్తు జ్ఞానము విద్వోపదేశకౌశలము మిక్కుటముగా లభించినది. పెక్కేల?