పుట:Kashi-Majili-Kathalu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కపింజలునికథ

147


కొని యీచంద్రాపీడుని శరీరమును విడువక వినాశనము కాకుండా నర్చింపుచుండుము. మృద్దారుశిలారూపములైన యప్రత్యక్షదేవతల సేవించుటకంటె ప్రత్యక్షదైవమైన యీచంద్రాపీడుని శరీరమును బూజించుటయే శ్రేయము. అట్లుచేయుము. ఎప్పటికేని యేదేవున కై ననుగ్రహము రాకపోవునా యని చెప్పిన విని కాదంబరి యప్పుడే లేచి తరళికామదలేఖలు సహాయముచేయఁ జంద్రాపీడుని శరీరమును మెల్లగానెత్తి శీతవాతాతపాది దోషరహితమైన యొకశిలాతలమం దునిచి శృంగారవేషము దీసికొని స్నానముచేసి పరిశుద్ధచిత్తయై ధౌతదుకూలములదాల్చి అధరకిసలయంబున దట్టముగాఁ బట్టియున్న తాంబూలరక్తిమమును బెక్కుసారులుతోమి కడిగి మాటిమాటికిఁ గన్నీరు గార్చుచు ననభ్యస్తము నపూర్వమునైన నియమముధరించి పూర్వము సురతోపభాగమునకై తెచ్చినపూవులు గంధము నంగరాగము ధూపములు మొదలగువానిచేతనే చంద్రాపీడమూర్తి నర్చించుచు మూర్తీభవించిన శోకదేవతయుంబోలెఁ జింతించుచు మరణముకన్న కష్టతరమైన యవస్థ ననుభవింపుచు నాహారము గుడువక వెండియు నతని యడుగులు తొడయం దిడుకొని యొత్తుచు నెట్టకేల కాదివసము గడిపినది.

మరునాఁడుదయంబున నూత్న తేజంబుతో నొప్పుచున్న చంద్రాపీడునింజూచి వెరగందుచుఁ గాదంబరి మదలేఖతో నాతీ! యీతని మేనికాంతి యెంతవింతగా నున్నదియో చూచితివా? ప్రేమాతిశయంబున నాకే యిట్లుతోచుచున్న దేమో నీవుగూడ విమర్శించి చూడుమని పలికిన విని మదలేఖ యిట్లనియె.

రాజపుత్రీ! ఇందు నిరూపింపవలసిన దేమియున్నది యీపనికిం జైతన్య మొండు కొరంతగా నున్నది కాని యధాస్థితిగానే యున్నవాఁడు కపింజలుఁడు చెప్పినమాట యథార్థమని దీనస్పష్టమగుచున్న