పుట:Kashi-Majili-Kathalu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

146

కాదంబరి


నన్నికార్యములు చక్కఁబడును. తపంబునంగాదే శర్వాణి! ఈశ్వరుని యర్ధాంగశరీరము ధరించినది. చింతింపకుమని యూరడించిన మహాశ్వేతయు నతనిమాటలచే దేరి స్వాంతమున సంతసము వహించినది.

అప్పుడు కాదంబరి కపింజలుంజూచి మహాత్మా! నీవును పత్రలేఖము నొక్కసారియే యీసరస్సులోఁ బడితిరికదా! పత్రలేఖ యేమైనదని యడిగిన నతం డిట్లనియె.

దేవీ! నీటిలోఁబడినతరువాత నేమిజరిగినదో నాకేమియుం దెలియదు. నేనిప్పుడు త్రికాలవేదియగు శ్వేతకేతునొద్దకుఁబోయి చంద్రాపీడునియాత్మ యెక్కడ నున్నదియో పుండరీకావతారమైన వైశంపాయనుఁ డేమయ్యెనో పత్రలేఖ యెక్కడికిఁ బోయినదో యతని నడిగి తెలిసికొనివచ్చెదనని పలుకుచునే యాకాశమునకు నిర్గమించి యఱిగెను.

అట్లతఁడఱిగినపిమ్మటఁ గాదంబరి మహాశ్వేతంజూచి ప్రియసఖీ! మనయిరువురకు సమానశోకంబు గలుగఁజేసిన భగవంతుఁ డిప్పుడు నన్ను నిలబెట్టెను. నిన్ను ప్రియసఖీ! యని పిలుచుట కిప్పటికి లజ్జింపకుంటిని. నాకిప్పుడు నీవు నెచ్చెలివైతివి. నాకిప్పుడు మరణమైనను దుఃఖముకొరకుగాదు. నీవిప్పుడు నాకుపదేశింపఁ దగియుంటివి. నేనిప్పు డేమి చేయవలయునో నాకుం దెలియకున్నది. నీవు విమర్శించి కర్తవ్య ముపదేశింపుమని పలికిన విని యక్కలికి కాదంబరి కిట్లనియె.

వయస్యా! ఈవిషయమై చెప్పుటకును వినుటకును నేమి యున్నది. మనకు ప్రియసమాగ్రమాశ యేమిచేయించునో యట్లు చేయఁదగినదే! పూర్వము వాఙ్మాత్రముచేతనే యోదార్చఁబడితిని. ఇప్పుడు కపింజలుఁడు పుండరీకునివృత్తాంతమును గురించి స్పష్టముగా జెప్పెనుకదా! నీవుమాత్ర మేమిచేయుదువు? నీదొడయం దుంచు