పుట:Kashi-Majili-Kathalu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

కాదంబరి


టాడక యేమియును వినక యెవ్వరింజీరక హా! యిప్పుడు నేనెక్కడ నుంటిని? యెక్కడికి వచ్చితిని? యేమిటికి వచ్చితిని? యెక్కడికిఁ బోవలయును? యేమిచేయవలయును? అని తలంచుచు నంథునివలె మూకునిపగిది జడునుభాతి నందుఁ గ్రుమ్మరుచుండెను.

అప్పుడు తురగమును గురుతుపట్టి రాజకుమారులు చంద్రాపీడుఁడు చంద్రాపీడుఁ డని పిలుచుకొనుచుఁ దొందరగా నతనిం జుట్టు కొనుటయు నతండు వారిని వైశంపాయనుఁ డెక్కడ నున్నవాఁడని గద్గదస్వరముతో నడిగెను. వారు దేవా! సర్వము నివేదింతుము. గుఱ్ఱము దిగి యీవృక్షచ్ఛాయను విశ్రమింపు డని దీనముఖులై పలుకుటయు నట్లుచేసి తదీయవాగ్ధోరణిం గనిపెట్టి యతండు చిత్తము విభ్రాంతి వహింపఁ బెక్కు తెరంగులఁ దలంచుచు నపరాధము చేసిన వాడుం బోలెఁ దల వాల్చుకొని మెల్లగా వానితో నిట్లనియె.

నేను పోయినవెనుక దారిలో సంగ్రమము తటస్థించినదా? లేక శీఘ్రములో నసువుల గ్రసియించు వ్యాథియెద్దియేని వచ్చినదా? పిడుగుపడినట్లు వైశంపాయనుని కింత యుపద్రవ మేల రావలయును? వేగమ చెప్పుడనుటయు వారందరు చెవులుమూసికొని శివశివా! అట్లనియెదరేల? పాపము వైశంపాయనుండు జీవించియే యున్నవాఁడు. ఇఁక నూరేండ్లు బ్రతుకునని పలుకగా విని యారాజనందనుండు డెందం బానంద సాగరంబునమునుంగ వారిఁ గంఠగ్రహణముజేయుచు వెండియు నిట్లనియె.

వైశంపాయనుండు బ్రతికియుండిన నాయాజ్ఞమీరి మఱియొక చోటికిఁ బోవువాఁడు కాడని యట్లంటి మంచిమాట జెప్పితిరి. అతం డిప్పు డెచ్చటికిఁ బోయెను? ఇచ్చటి కేల రాడు? అతనివిడిచి మీరేమిటికి వచ్చితిరి? వినువరకు నాచిత్తముత్తలమందుచున్నది. వేగమ చెప్పుఁడని యడిగిన నమస్కరించుచు వారిట్లు చెప్పఁదొడంగిరి.