పుట:Kashi-Majili-Kathalu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16]

కాదంబరి కథ

121


దేవా! దేవర లెస్సగా నాలోచించితిరి. ఇతండు విద్యలన్నియు గ్రహించెను. దిగ్విజయము చేసెను. ప్రజల కుత్సాహము గలుగఁ జేసెను. ఇఁక మిగిలిన కృత్యము పరిణయమే కదా! అవస్యము దానిగురించి యాలోచింపవలయునని పలికెను.

అట్టిసమయమునఁ జంద్రాపీడుఁడు సిగ్గుచే తల వాల్చుకొని యాత్మగతంబున భళిరే! వీరిసంవాదము కాదంబరీ సమాగమమునకు నుపశ్రుతివలెఁ దోచినది. నావిషయమై మాతండ్రి కిప్పు డిట్టి బుద్ధి పుట్టుట సముద్రంబునఁ బడినవానికి యానపాత్రము దొరికినట్లుగా నున్నది. అని పెక్కు తెరంగుల నాలోచించు నంతలో వైశంపాయనుని ప్రస్తావన వచ్చుటయు నతని నెదుర్కొనుటకు ననుజ్ఞ యిమ్మని చంద్రాపీడుఁడు శుకనాసముఖముగాఁ దండ్రికిఁ విజ్ఞాపనజేసి కొనియెను.

తారాపీడుఁడు వైశంపాయను నెదుర్కొనుటకు బుత్రునకాజ్ఞ యిచ్చుటయు నతని డత్యంత సంతోషముతో నారాత్రి వేగించి సుహృద్ధర్శనలాలసుండై వేగుజాముననే లేచి ప్రాతఃకాలకృత్యముల నిర్వతి౯ంచి యుచిత పరివారముతో నింద్రాయుధమెక్కి యతివేగముగా సేనాముఖమునకుఁ బోయెను.

స్కంధావారమును ప్రవేశించినతోడనే గుఱ్ఱముపైనుండియే యత్యాతురముతో వైశంపాయనుఁ డెచ్చట నున్నవాఁడని యడిగెను. ఆమాట విని యందున్న స్త్రీలు కొంద రెద్దియో పని తొందరలో నుండి యతని గురుతుపట్టఁజాలక కన్నీరు విడుచుచు, అయ్యో! ఇం కెక్కడి వైశంపాయనుఁడు? ఆతని నడిగెదరేటి కని పలికిరి.

ఆమాటలు విని ఆ, పాపులారా! అట్లనియెద రేల? యనిహృదయంబు ఝల్లుమన వారినదలించుచు, మఱియొకరినడుగక భయపడుచు గుంపువీడిన లేడిపిల్లవలె బెదరుచు నేమియుం జూడక యేమియు మా